ఖైరతాబాద్, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో హైదరాబాద్ వైద్య రంగానికి హబ్‌గా మారిందని, నేషనల్ బోర్డు ఆఫ్ ఎక్సామినేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్‌పాయ్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని ప్రైవేట్ దవాఖానల్లో వైద్య,విద్యను అందించే వైద్య 54మంది ఉపాధ్యాయులకు శనివారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఉత్తమ బోధకుల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ఎన్బీఈ అనుమతితో వైద్య, విద్యను అందిస్తున్న దవాఖానలో సుమారు 11 వేల వరకు పీజీ సీట్లు, 3,500 డిప్లొమా ఎంబీబీఎస్ సీట్లు పెంచారని తెలిపారు. వైద్య విద్య బోధనలో విలువలను పెంపొందించి, పరిశోధనల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో ఎంతో మంది వైద్య విద్యార్థులు సేవలు అందించి వేలాదిమంది ప్రాణాలను కాపాడటం అభినందనీయమన్నారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్య విద్య కోసం సెమినార్లు నిర్వహించి బోధనపై అధ్యాపకులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఆరోగ్య సేవలు సులభంగా అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అలెగ్జాండర్, తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ లింగయ్య, ఎన్బీఏఐ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బాలరాజు, డాక్టర్ సురేశ్‌కుమార్, డాక్టర్ ఖుబుచంద్, డాక్టర్ హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.