చేరువలో సూరారం మోడ్రన్ క్యాంటీన్
నిండా భోజనం.. విశిష్ట సేవలు
పెరుగుతున్న ఆదరణ
పత్యేక చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు
కుత్బుల్లాపూర్, జనవరి14 : బాటసారుల కడుపునింపుతున్నది అన్నపూర్ణ క్యాంటీన్. అతిథిగా ఆదరించి…ఆకలితో అలమటించే పరిస్థితి లేకుండా పేదలకు చేయూతను అందిస్తున్నది.. నిత్యం మధ్యాహ్నం ఒంటిగంట కాగానే అందులో భోజనానికి కొదవ ఉండదు. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేందుకు బల్దియా ఏర్పాటు చేసిన మోడ్రన్ అన్నపూర్ణ క్యాంటీన్ సూరారంలో ప్రత్యేకంగా నిలుస్తున్నది. రోజుకు సగటున 300 మందికి భోజనాన్ని అందిస్తూ వారి ఆకలిని తీర్చుతున్నది. కేవలం రూ.5 భోజనాన్ని కడుపు నిండా రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు హరేరామ హరే క్రిష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు సూరారంలో మాడ్రన్ క్యాంటీన్లో భోజన ఏర్పాటు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గాజులరామారం సర్కిల్ అధికారులు ఇటీవల సూరారంలోని మోడ్రన్ క్యాంటీన్‌ను తీర్చిదిద్దారు. రోడ్డుపక్కన ఉండే క్యాంటీన్‌ను గతంలో వచ్చిపోయే వాహనాలతో ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించేందుకు స్థానిక మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నెల రోజుల వ్యవధిలో రోజురోజుకూ ఇక్కడి పేదవారి సంఖ్యపెరుగుతున్నది.
మౌలిక వసతులతో…
స్థానికంగా ఉన్న మాడ్రన్ క్యాంటీన్లో బయట నుంచి ఎలాంటి దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు ప్రత్యేక షెడ్డు నిర్మాణం చేపట్టారు. దీనిలో వాష్ బేసిన్, అన్నం తినేందుకు బల్లలు, నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. స్థానికంగా ఎంతో మంది నిత్యం వలస కూలీలు, ఆస్పత్రులకు వచ్చే రోగి బంధువులు, బాటసారులకు అందించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకున్నారు. గతంలో కేవలం 60 నుంచి 100 మందికి మాత్రమే భోజనం అందించేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 300లకు పెరిగింది.
అధికారులు ఏర్పాటు చేసిన వసతులతో అన్నపూర్ణ క్యాంటీన్‌కు వచ్చే వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు.
మరింత తీర్చిదిద్దుతాం
క్యాంటీన్‌ను మాడ్రన్‌గా తీర్చిదిద్దాం. స్థానికంగా నిత్యం ఎంతో మంది పేదలకు ఇక్కడ భోజనం అందిస్తున్నాం. రోజురోజుకూ సంఖ్య పెరుగుతున్నది. దీనికి తోడు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటాం. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరి కడుపు నింపేందుకు కృషి చేస్తాం. – ప్రశాంతి, ఉప కమిషనర్, గాజులరామారం