వ్యాపార సముదాయాలను స్వీయ ఆమోదం చేసుకోవాలి
ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగింపు
కేటగిరీ మార్చుకోవాలంటున్న అధికారులు
జూబ్లీహిల్స్,జనవరి13: వ్యాపార సముదాయాలుగా అభివృద్ధి చెందిన భవనాలకు స్వీయ ఆమోదం ( (సెల్ఫ్ అసెస్మెంట్) గడువును జీహెచ్ఎంసీ పొడిగించింది. వ్యాపార భవనాలుగా స్వీయ ఆమోదం పొందడానికి మరో అవకాశం కల్పించింది. నగరంలో రహదారుల వెంబడి గృహ సముదాయాల్లో వ్యాపారాలు నిర్వహించే దుకాణదారులు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకుగానూ నగర పాలక సంస్థ డిసెంబర్ 31 వరకు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో స్వీయ ఆమోదం ద్వారా కేటగిరీ మార్పునకు ముందుకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. నాడు నివాసాలుగా ఉన్న భవనాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు వాటికి నివాస భవనాలుగానే పన్ను చెల్లిస్తున్నారు. నివాస సముదాయాలకు గ్రౌండ్ ఫ్లోర్లో షెటర్లు ఏర్పాటు చేసి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుకాణాలకు విద్యుత్ కేటగిరీ మారినా బల్దియా చిట్టాపద్దులలో మాత్రం ఆ భవనం నివాస సముదాయంగానే కొనసాగుతుంది. ఇలా వ్యాపార సముదాయాలు.. నివాస భవనాలుగా చెలామణి అవుతుండడంతో జీహెచ్ఎంసీ ఆదాయాన్ని కోల్పోతుంది. స్వీయ ఆమోదం ద్వారా భవన వినియోగ మార్పును ఆన్లైన్లో చేసుకునే వెసులుబాటు ఉన్నా సంబంధిత వ్యాపార నిర్వాహకులు ముందుకురాకపోవడంతో ఇది అమలుకు నోచుకోవడం లేదు. దీంతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న బల్దియా అధికారులు స్వీయ ఆమోదం ద్వారా భవన వినియోగ మార్పునకు ముందుకు రాని వారిపై చ ర్యలు తీసుకోనున్నారు. గ డువు ముగిసిన తరువాత నివాస అనుమతితో వ్యాపారాలు కొనసాగిస్తున్న దుకాణాలను గుర్తించి చలానాలు వేయనున్నారు. ఇం దులో భాగంగా జీహెచ్ఎంసీ ఫిబ్రవరి 15 వరకు మరోసారి గడువును పొడిగించింది.