10K Marathon | సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆఫ్ ఇండియా (SEMI) ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 6 గంటలకు నెక్లెస్ రోడ్లో 5కే, 10కే మారథాన్ నిర్వహించనున్నారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసన్ డే సందర్భంగా మారథాన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సెమీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, శ్రీని ఇన్ఫ్రా ఎండీ శ్రీనివాస్, సెమీ ప్రతినిధులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మారథాన్‌కు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందజేశారు. ‘ఎవ్రీ సెకండ్స్’ థీమ్‌తో మారథాన్‌ను నిర్వహిస్తున్నామని, దీంతో పాటు సీపీఆర్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సుధాకర్ పేర్కొన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది డాక్టర్లు పాలుపంచుకుంటున్నట్లు వివరించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాలను కాపాడే ఎమర్జెన్సీ డాక్టర్ల అవగాహన కోసం మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అభినందించారు. అత్యవసర పరస్ధితిల్లో ఎమర్జెన్సీ వైద్యుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ మేరకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సెమి నేషనల్ సెల్ అకాడమిక్ కౌన్సిల్ చైర్మన్ శ్రీనాథ్, నేషనల్ గవర్నస్ చైర్మన్ ఇమ్రాన్ సుభాన్, ఆర్గనైజింగ్ చైర్మన్ శర్వానన్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కిరణ్ వర్మ, కో ఆర్టినేటర్ తరుణ్ పాల్గొన్నారు.