మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 25: సీఎం కేసీఆర్ పాలనలో వివిధ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4, 5, 11, 12, 13, 14వ వార్డుల్లో రూ. 3.24 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, వైకుంఠ ధామం అభివృద్ధి, ఆర్సీసీ పైప్ లైన్ పనులకు సోమవారం మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలని గత తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరమే మున్సిపాలిటీల రూపురేఖలు మారాయన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని చెప్పారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో అత్యధిక నిధులతో అభివృద్ధి జరిగి ముందుకు దూసుకుపోతున్నదన్నారు. పాలకవర్గ సభ్యులు సైనికుల్లా పనిచేయడం అభినందనీయమన్నారు. ఎన్నికలు వస్తున్నందున ఎవరో వచ్చి లేనిపోని మాయమాటలతో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ రాములు, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, జైపాల్‌రెడ్డి, బాల్‌రాజ్, హేమత్ రెడ్డి, పెంటయ్య, వీణ సురేందర్ గౌడ్, అంతోనమ్మ, రాజకుమారి, శ్రీనివాస్ యాదవ్, సరస్వతి, కో- ఆప్షన్ సభ్యులు దేవేందర్, జయశ్రీ జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.