జూబ్లీహిల్స్, జూన్ 10 : ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది ఆంగ్ల బోధనతో అబ్బురపరచనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నింటినీ ఆంగ్ల మాధ్యమంలోకి అప్గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. మనబస్తీ.. మనబడి కార్యక్రమంతో సర్కారు బడులను ఆధునీకరిస్తుండటంతో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెడుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. జూన్ 3వ తేదీ నుంచి ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ ప్రారంభించిన అధికారులు పాఠశాలలు పునః ప్రారంభమైన తరువాత ఈనెల 13వ తేదీ నుంచి 30 వరకు బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ముమ్మరంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటీకే కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బస్తీల్లో ఉపాధ్యాయులతో కలిసి ప్రచారం చేపడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల ఉచిత యూనిఫాం, సన్నబియ్యంతో ఉచిత భోజన సౌకర్యం, మౌలిక వసతులతోపాటు ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో ఆంగ్ల బోధనపై విస్తృత ప్రచారం చేపడుతున్నారు. అయితే కరోనా నేపథ్యంలో గతేడాది నుంచే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు పెద్ద ఎత్తున ఆకర్శితులవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు పెరగనున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 40 కు పైగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో పాటు 17 ఉన్నత పాఠశాలల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపడుతున్నట్లు డిప్యూటీ డీఈఓ చిరంజీవి తెలిపారు.