చైత్రం: ఈ మాసంలో అశ్విని, భరణి కార్తెలు ఉన్నాయి. అనావృష్టి సూచనలు గోచరిస్తు న్నాయి. ప్రారంభంలో గాలితో కూడిన వర్షాలు ఉంటాయి. మాసాంతంలో అక్కడక్కడా అకాల వర్షాలు ఉంటాయి.
వైశాఖం: ఈ నెలలో కృత్తిక, రోహిణి కార్తెల ప్రవేశ సమయాన్ని బట్టి అకాల వర్షాలు ఉన్నాయి. గాలితో కూడిన వానలు ఉంటాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి.
జ్యేష్ఠం: ఈ నెల మృగశిర, ఆర్ద్ర, పునర్వసు కార్తెలు ప్రవేశిస్తున్నాయి. ప్రారంభంలో వ్యవసాయదారులకు పంటలకు అనుకూలమైన వర్షాలు ఉంటూ, తరువాత కొంత ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా గాలితో కూడిన వానలు ఉన్నాయి.
ఆషాఢం: ఈ నెలలో పుష్యమి, ఆశ్లేష కార్తెల ప్రవేశ సమయంలో యోగాలు బలీయంగా ఉన్నాయి. అనుకూల వర్షాలు ఉండగలవు. ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. నెల చివరిలో వర్షాలు అనుకూలిస్తాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. నదులు నిండుగా ప్రవహిస్తాయి.
శ్రావణం: ఈ మాసంలో మఖ, పుబ్బ కార్తెలు ప్రవేశిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సువృష్టి ఉంది. ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయి. మొత్తం మీద సామాన్య వర్షపాతం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని ముసురు ఉంటుంది. మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయి.
భాద్రపదం: ఈ మాసంలో ఉత్తర, హస్త కార్తెలు ప్రవేశిస్తాయి. వీటి ప్రవేశ యోగాలు అనుకూలంగా ఉన్నాయి. మాసం ప్రారంభంలో మధ్యమ వానలు ఉంటాయి. తరువాత అనుకూల వర్షాలు ఉండగలవు. కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టితో ఇబ్బందులు ఉంటాయి.
ఆశ్వయుజం: ఈ మాసంలో చిత్త, స్వాతి కార్తెలు ప్రవేశిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. నెల ప్రారంభంలో చిరుజల్లులు కురుస్తాయి. మాసాంతంలో స్వల్పవృష్టి. మేఘాడంబరం తప్ప వర్షం తక్కువే.
కార్తికం: ఈ మాసంలో విశాఖ, అనూరాధ కార్తెలు ప్రవేశిస్తున్నాయి. కార్తెల ప్రవేశ సమయం ప్రతికూలంగా ఉండటం వల్ల వర్షలేమి గోచరిస్తున్నది. పంటలకు కొంత ఇబ్బంది ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాల్లో అతివృష్టి. తుపానుల వల్ల పంటలకు ఇబ్బంది.
మార్గశిరం: ఈ మాసంలో ఉన్న కార్తెల ప్రవేశ సమయంలో గ్రహస్థితి వలన వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షపాతం తక్కువే! చలిగాలులు పెరుగుతాయి. నెల ప్రారంభంలో కొంత అక్కడక్కడా వర్షాలు ఉంటాయి.
పుష్యం: ఈ మాసంలో కార్తుల ప్రవేశ యోగాలు సామాన్యంగా ఉన్నవి. కనుక కొన్ని ప్రాంతాల్లో వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావం గోచరిస్తున్నది. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి. చలిగాలులు, ఎండలు ఉంటాయి.
మాఘం: ఈ మాసంలో కార్తెల ప్రభావం అనుకూలంగా ఉంటుంది. రుతువుకు అనుకూలంగా వాతావరణం ఉంటుంది. చల్లని గాలులు, వేడి, సమపాళ్లలో ఉండగలవు.ప్రజలకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
ఫాల్గుణం: ఈ మాసంలో సూర్య నక్షత్ర సమయంలో ఉన్న యోగాల మూలంగా వేడి క్రమంగా పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చలి, మరికొన్ని చోట్ల అధిక ఎండలు ఉంటాయి. అక్కడక్కడా సామాన్య వర్షాలు కురిసే అవకాశం.
మేష సంక్రమణం (13/4/2024)
శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుక్ల పంచమి శనివారం తేదీ 13-04-2024 రాత్రి 9-04 గంటలకు మృగశిర 4వ పాదం మిథున రాశి ప్రయుక్త వృశ్చిక లగ్న సమయంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
ఫలితం: శుక్ల షష్ఠి – సామాన్య వర్షం, శనివారం- అనారోగ్యం, మృగశిర నక్షత్రం- శుభప్రదం, శోభనం నామ యోగం- ప్రజలలో అన్యోన్యత, కౌలవ కరణం – సమయానుకూల వర్షాలు, రాత్రి సమయం- సస్యాభివృద్ధి, వృశ్చిక లగ్నం- కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం. సాముదాయిక ఫలితం: ప్రజలలో దైవభక్తి పెరుగుతుంది.
మౌఢ్య నిర్ణయం
శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్ర కృష్ణ తదియ శనివారం తేదీ 27-04-2024 నుంచి ఆషాఢ శుద్ధ పంచమి గురువారం తేదీ 11-07-2024 వరకు శుక్ర మౌఢ్యం ఉన్నది. మళ్లీ ఫాల్గుణ కృష్ణ విదియ ఆదివారం తేదీ 16/3/2025 నుంచి ఫాల్గుణ అమావాస్య శనివారం తేదీ 29/3/2025 వరకు శుక్ర మౌఢ్యం.చైత్ర కృష్ణ దశమి శుక్రవారం తేదీ 3/5/2024 నుంచి వైశాఖ కృష్ణ ద్వాదశి సోమవారం తేదీ 3/6/2024 వరకు గురు మౌఢ్యం. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం.