Uric Acid | యూరిక్ యాసిడ్ సమస్య వయసు పైబడిన వారిలో, ముఖ్యంగా పురుషుల్లో మాత్రమే కనిపిస్తుందని చాలా మంది భావిస్తారు. మటన్ లేదా అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్లే ఈ సమస్య వస్తుందని కూడా అనుకుంటారు. అయితే జీవనశైలి, జీవక్రియల (మెటబాలిక్) సమస్యలు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్య యువతలో, ముఖ్యంగా 30 ఏళ్ల వయసులో ఉన్న మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. 30 ఏళ్ల వయసులో ఉన్న ఓ మహిళకు కీళ్ల నొప్పులు, అలసట, బరువు పెరగడం వంటి సమస్యలు రావడంతో పరీక్షలు చేయించగా యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు తేలింది. ఈ సమస్య వృద్ధాప్యంలోనే వస్తుందని భావించిన ఆమెకు ఈ ఫలితం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో యూరిక్ యాసిడ్ ఏ వయసులోనైనా పెరుగుతుందనే విషయంపై అవగాహన పెరుగుతోంది.
యూరిక్ యాసిడ్ పెరగడానికి కేవలం మటన్ లాంటి ఎర్రని మాంసం లేదా అధిక ప్రోటీన్ మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. అధికంగా చక్కెర తీసుకోవడం, తీపి పానీయాలు ఎక్కువగా తాగడం, ఊబకాయం, తగినంత నీరు తాగకపోవడం, జీవక్రియల్లో లోపాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి అనేక కారణాలు కూడా ఈ సమస్యకు దారితీస్తాయి. యూరిక్ యాసిడ్ నియంత్రణ కోసం ఏ ఆహారం తినకూడదనే అంశంపైనే దృష్టి పెట్టడం సరిపోదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోని అసలు కారణాలను గుర్తించి మొత్తం జీవనశైలిని మెరుగుపరచడం మరింత ముఖ్యమని చెబుతున్నారు. యూరిక్ యాసిడ్‌ను నియంత్రించేందుకు రోజంతా తగినంత నీరు తాగడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరుచుకోవడం, అధిక చక్కెర తీసుకోవడాన్ని తగ్గించడం వంటి మార్పులు చేయాలని సూచిస్తున్నారు.
ఇలాంటి జీవనశైలి మార్పులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే సమస్యకు కారణమవుతున్న అంశాలను అర్థం చేసుకుని వాటిని సరిదిద్దడం ద్వారా దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు పొందవచ్చు. యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు కేవలం ఏ ఆహారాన్ని మానేయాలనే అంశంపైనే కాకుండా, శరీరంలో నీటి శాతం, సమతుల ఆహారం, బరువు నియంత్రణ, జీవక్రియల ఆరోగ్యం వంటి అంశాలపై కూడా సమానంగా దృష్టి పెట్టడం అవసరం. ఈ చిన్నచిన్న జీవనశైలి మార్పులే యూరిక్ యాసిడ్‌ను సహజంగా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.