Conocarpus Trees | రహదారుల పక్కన లేదా మధ్య భాగంలో గతంలో మనకు ఎక్కడ చూసినా కోనోకార్పస్ చెట్లు ఎక్కువగా కనిపించేవి. వీటి శాస్త్రీయ నామం కోనోకార్పస్ ఎరెక్టస్. ఎలాంటి కరువు పరిస్థితులను అయినా సరే ఎదుర్కోవడం, చిన్న కాండం ఉన్నా చాలు ఏపుగా పెరగడం ఈ చెట్ల ప్రత్యేకత. అయితే ఈ చెట్లను అధికంగా నాటారు. కానీ వీటి వల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని సైంటిస్టులు చెప్పడంతో చాలా వరకు రాష్ట్రాల్లో ఈ చెట్లను నరికేస్తున్నారు. అయినప్పటికీ మోడు నుంచి మళ్లీ ఆకులు పుట్టుకొస్తున్నాయి. అంటే ఈ చెట్లు ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ చెట్లను తెలంగాణ, ఏపీతోపాటు గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నరికేస్తున్నారు. అనేక కాలనీల్లో సైతం ఈ చెట్ల వల్ల హాని కలుగుతుందని తెలుసుకుని నరికేస్తున్నారు. అయితే ఈ చెట్లు నిజంగానే హానికరమా.. సైంటిస్టులు ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోనోకార్పస్ చెట్లు శీతాకాలంలో అధికంగా పువ్వులను పూస్తాయి. దీంతో ఆ పువ్వుల నుంచి వెదజల్లే పుప్పొడి గాలిలో కలుస్తుంది. ఇది మనకు అనేక అలర్జీలను కలగజేస్తుంది. శీతాకాలంలో సహజంగానే శ్వాసకోశ సమస్యలు మనకు అధికంగా వస్తుంటాయి. అలాంటి సమయంలో ఈ పుప్పొడిని గనుక పీలిస్తే శ్వాసకోశ సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అదే అలర్జీలు ఉన్నవారికి అయితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కోనోకార్పస్ చెట్ల పుప్పొడి అధికంగా అలర్జీలను కలిగిస్తుంది. దీంతో తీవ్రమైన దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయి. తరచూ ముక్కు నుంచి నీళ్లు కారడం, తుమ్ములు, కళ్ల నుంచి కూడా నీరు కారడం, చర్మంపై దద్దుర్లు ఏర్పడడం, దురదలు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు కూడా దెబ్బ తింటుంది. కనుకనే ఈ చెట్లను తొలగిస్తున్నారు.
కోనోకార్పస్ చెట్లు పర్యావరణంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చెట్ల వేర్లు భూమి లోపలి పొరల్లోకి చాలా సులభంగా చొచ్చుకుని పోతాయి. ఎంత చిన్న చెట్లు అయినా సరే వేర్లు బాగా లోపలికి వెళ్తాయి. అంతేకాకుండా భూగర్భ జలాలను మొత్తం పీల్చుకుంటాయి. దీంతో ఇతర చెట్లకు కావల్సిన నీరు సరిగ్గా లభించదు. అలాగే బోర్లు కూడా అడుగంటి పోతాయి. దీంతో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కోనోకార్పస్ చెట్లను పెంచడం క్షేమకరం కాదని సైంటిస్టులు తేల్చారు. ఇక ఈ చెట్ల వేర్ల వల్ల భవన నిర్మాణాలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఈ చెట్ల వేర్లు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలోకి కూడా వెళ్లగలవని, పునాదుల్లో చేరి నిర్మాణాలకు ప్రమాదం తెచ్చి పెడతాయని అంటున్నారు. కాబట్టి కోనోకార్పస్ చెట్లను తొలగించాల్సిందేనని అంటున్నారు.
కోనోకార్పస్ చెట్లను పెంచడం వల్ల అన్ని రకాలుగా హాని కలుగుతుందని కనుక వాటిని నరికేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన సైంటిస్టులు ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. అందుకనే చాలా రాష్ట్రాల్లో ఈ చెట్లను తొలగిస్తున్నారు. ఇవి చూసేందుకు పచ్చగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ పర్యావరణానికి, జీవులకు చేసే నష్టం చాలానే ఉంటుందని అంటున్నారు. అయితే ఈ చెట్లు ఉన్న ప్రాంతంలోని నేల కూడా నిర్జీవంగా మారుతుందని, నేలలో ఉండే పోషకాలను ఈ చెట్లు పూర్తిగా శోషించుకుంటాయని, దీంతో ఇతర చెట్లు, మొక్కలు పెరగడం కష్టమవుతుందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇన్ని రకాలుగా కోనోకార్పస్ చెట్లు నష్టం కలగజేస్తాయి కనుక వీటిని తొలగిస్తేనే మంచిదని పర్యావరణ వేత్తలు కూడా అంటున్నారు.