Cod Liver Oil | డాక్టర్ల సూచన మేరకు లేదా సొంతంగానే చాలా మంది అనేక రకాల సప్లిమెంట్లను ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా పోషకాలకు చెందిన సప్లిమెంట్లను వాడుతారు. అయితే అలాంటి సప్లిమెంట్లను వాడేవారు ఫిష్ ఆయిల్ అనే పదాన్ని కూడా వింటుంటారు. అయితే ఫిష్ ఆయిల్ అంటే ఏమిటి..? దీన్ని వంటలకు వాడవచ్చా..? ఎలా తీసుకోవాలి..? దీంతో కలిగే లాభాలు ఏమిటి..? అని ఆలోచిస్తుంటారు. అయితే ఫిష్ ఆయిల్ అనేది సాధారణ వంట నూనె కాదు. దీన్ని వంటలకు ఉపయోగించరు. సప్లిమెంట్‌గా వాడుతారు. అంటే పోషక పదార్థంగా ఈ ఆయిల్‌ను తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీన్నే కాడ్ లివర్ ఆయిల్ అని కూడా అంటారు. ఇది పోషకాలతో కూడిన ఒక రకమైన నూనె. కాడ్ ఫిష్ అనే చేపలకు చెందిన లివర్ నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. కనుకనే దీనికి ఆ పేరు వచ్చింది. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను రోగులకు డాక్టర్లు సూచిస్తుంటారు. పలు రకాల వ్యాధులు ఉన్నవారికి వీటిని వాడమని చెబుతుంటారు.
ఫిష్ ఆయిల్ లేదా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లలో అనేక పోషకాలు ఉంటాయి. వాటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే అధిక మొత్తంలో విటమిన్ ఎ, డి కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. కాడ్ లివర్ ఆయిల్ లేదా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు సైతం తగ్గిపోతాయి. ముఖ్యంగా గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
కాడ్ లివర్ ఆయిల్‌ను తీసుకుంటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఈ ఆయిల్లో ఉండే విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ డి వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. కాడ్ లివర్ ఆయిల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఎ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. దీని వల్ల దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
కాడ్ లివర్ ఆయిల్‌ను తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఈ ఆయిల్లో ఉండే విటమిన్ డి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. దీని వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి చలికాలంలో ఎంతో మేలు జరుగుతుంది. కాడ్ లివర్ ఆయిల్ సప్లిమెంట్లు మనకు క్యాప్సూల్స్, లిక్విడ్ రూపంలో లభిస్తాయి. అయితే వీటిని డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. కొందరికి కాడ్ లివర్ ఆయిల్ పడకపోవచ్చు. కనుక వైద్యుల సలహాను పాటించాల్సి ఉంటుంది. ఇలా దీన్ని జాగ్రత్తగా తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.