Soaked Peanuts | పల్లీలను మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం చేసి తినే ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ ఫాస్ట్‌లకు చట్నీగా పల్లీలతో చేసే వంటలను తింటుంటాం. పల్లీలతో స్వీట్లు కూడా తయారు చేస్తారు. మసాలా వంటకాల్లోనూ వీటి వాడకం ఎక్కువే. అయితే చాలా మంది పల్లీలను నేరుగా అలాగే తింటుంటారు. కానీ వీటిని నీటిలో నానబెట్టిన తరువాతే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పల్లీల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అందువల్ల పల్లీలను నేరుగా అలాగే తింటే ఇది మనం తినే ఆహారంలో ఉండే ఇతర పోషకాలతో కలిసి వాటిని బయటకు పంపుతుంది. దీంతో మనకు పోషకాలు లభించవు. పోషకాహార లోపం ఏర్పడుతుంది. కనుక ఫైటిక్ యాసిడ్ ప్రభావం తగ్గించాలంటే పల్లీలను ఎల్లప్పుడూ నీటిలో నానబెట్టిన తరువాతే తినాలి. ఇలా తింటే ఫైటిక్ యాసిడ్ చాలా తక్కువగా ఉంటుంది కనుక అది ఇతర పోషకాలపై ప్రభావం చూపలేదు. దీంతో పోషకాలను కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు.
రోజూ ఒక కప్పు మోతాదులో పల్లీలను నీటిలో నానబెట్టి తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పల్లీలను నానబెట్టి తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. 100 గ్రాముల నానబెట్టిన పల్లీలను తింటే సుమారుగా 587 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 26 గ్రాములు, ఆరోగ్యకరమైన కొవ్వులు 50 గ్రాములు, పిండి పదార్థాలు 16 గ్రాములు, ఫైబర్ 8.5 గ్రాములు, విటమిన్లు బి3, బి9, బి1, బి6, బి5, ఇ, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందువల్ల పల్లీలను రోజూ తింటే పోషకాహార లోపం ఏర్పడదు. శరీరానికి పోషణ లభిస్తుంది.
పల్లీలను నీటిలో నానబెట్టి తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి. పలు పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. పల్లీలను వేయించి తినకూడదు. క్యాలరీలు అధికంగా చేరి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. పల్లీలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. పల్లీలలో ఉండే ఫైబర్ కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. పల్లీలను తినడం వల్ల శరీరం మనం తినే ఆహారంలో ఉండే ఐరన్, జింక్, మెగ్నిషియం, క్యాల్షియం వంటి పోషకాలను సులభంగా శోషించుకుంటుంది. పల్లీలలో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదపడతాయి. దీంతో శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు.
పల్లీలలో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. పల్లీలలో ఉండే ఫైబర్ వల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పల్లీలను తింటే క్యాలరీలు అధికంగా లభిస్తాయి. అయినప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల పల్లీలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తాయి. దీంతో డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. షుగర్ ఉన్నవారు పల్లీలను తింటుంటే షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇలా రోజూ నీటిలో నానబెట్టిన పల్లీలను తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.