గురువారం 21 జనవరి 2021
Health - Dec 01, 2020 , 20:28:14

కూరగాయలు, జ్యూసులు వీటిలో ఏది బెస్ట్..?

కూరగాయలు, జ్యూసులు వీటిలో ఏది బెస్ట్..?

హైద‌రాబాద్ : కూరగాయలు, వాటి రసాలు రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిలో ఏది బెస్ట్ అనే ఆలోచన మీకు వచ్చిందా.  అవును ఈ మధ్య చాలా మందికి వస్తున్న సందేహం ఏంటంటే.. కూరగాయలు వండకుండా అలాగే పచ్చిగానే తింటే మంచిదా లేక.. వాటిని జ్యూస్ చేసుకుని తాగితే మంచిదా అని. దీనికి కూడా సమాధానం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రముఖ న్యుట్రిషియనిస్ట్, క్లినికల్ డైటీషియన్ పూజా మఖిజా చెబుతున్న విషయం ఏంటంటే.. కూరగాయల్లో ఎక్కువగా ఉండేది వాటర్-సాలుబుల్ విటమిన్స్(నీటిలో కరిగిపోయేవి). ఇవి శరీరంలో ఆక్సిడేషన్ కారణంగా తేలికగా పోతుంటాయి. ఇక వాటిని కోసి, కాసేపు ఉంచి వంటకు సిద్ధం చేసే సరికి వాటిలో నుంచి కొన్ని న్యుట్రియన్లు పోతాయట. తర్వాత వేడి పొయ్యి మీద వాటిని వండటం వల్ల మరిన్ని న్యూట్రియన్లు వాటి నుంచి పోతాయి. ఇదంతా అయ్యాక వాటిని నమిలి తినడం వల్ల కూరగాయల నుంచి మన శరీరానికి విటమిన్లు, మినరల్స్ చాలా తక్కువ అందుతాయని ఆమె వివరించారు.

మరోవైపు.. కూరగాయలను జ్యూస్ చేసుకుని తినడం వల్ల వాటి నుంచి ఎలాంటి విటమిన్లు, మినరల్లు బయటకు పోకుండా నేరుగా, త్వరగా మన శరీరానికి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కూరగాయలు వండుకుని తినే కన్నా.. జ్యూస్ చేసుకుని తాగడమే ఆరోగ్యానికి మంచిదని పూజా చెప్పుకొచ్చారు.

* ఎలాంటి కూరగాయలను జ్యూస్ చేసుకోవచ్చు..?

ఒకే రకమైన కూరగాయల రసం తాగే కన్నా.. బీట్రూట్, క్యారెట్ లాంటి రకరకాల కూరగాయలను కలిపి రసం చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ న్యూట్రియన్లు అందుతాయి.  

* ఎంత తాగాలి..?

కనీసం రోజుకు ఒక గ్లాసు అయినా వెజిటెబుల్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిది.

* ఏం లాభం..?

రెండు వారాలు వరుసగా తాగి చూడండి.. మీ జుట్టు, చర్మంలతో పాటు రోగనిరోధక శక్తి, బలంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు.


logo