మా బాబుకు నాలుగేండ్లు, పాపకు ఎనిమిది సంవత్సరాలు. అన్ని వ్యాక్సిన్స్ క్రమం తప్పకుండా ఇప్పించాం. ఐదేండ్ల తర్వాత వ్యాక్సిన్లు ఏమీ ఇప్పించాల్సిన అవసరం లేదనుకున్నాం. కానీ, పిల్లల వైద్యుణ్ని సంప్రదిస్తే ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇప్పించాలని చెప్పారు. ఇది నిజంగా అవసరమా? ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించిన తర్వాత కూడా పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరాలు వస్తున్నాయి. మరి ఇప్పించి ప్రయోజనం ఏమిటి ?
ఫ్లూ వ్యాక్సిన్ ఏటా ఇప్పించాలా అని అడిగితే.. తీసుకోవాల్సిందేనని చెప్పాల్సి వస్తుంది. ఫ్లూ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. దీనిద్వారా పిల్లలకు విపరీతంగా జ్వరం వస్తుంది. జ్వరం తీవ్రత 103, 104 డిగ్రీల ఫారన్హీట్ వరకు ఉండవచ్చు. ఒళ్లు నొప్పులు భరించలేనంతగా ఉంటాయి. దగ్గు, గొంతునొప్పితో బాధపడుతూ పిల్లలు బలహీనంగా మారిపోతారు. కొన్నిసార్లు ఈ వైరస్ న్యుమోనియాకు దారితీయవచ్చు. చెవిలో ఇన్ఫెక్షన్ కలగజేయవచ్చు. తీవ్ర స్థాయిలో ఊపిరితిత్తులను ఇన్ఫెక్ట్ చేయవచ్చు. ఇది సాధారణంగా వచ్చే జలుబు కాదు.
రెగ్యులర్ జలుబు రైనో వైరస్ వల్ల వస్తుంది. దీనివల్ల కాస్త జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటాయి. పిల్లలు దీని బారినపడినా తీవ్ర అస్వస్థతకు గురికారు. హుషారుగానే ఉంటారు. ఆకలి కాస్త మందగిస్తుందంతే! ఇన్ఫ్లుయెంజా అలా కాదు. ఇది తీవ్రమైన లక్షణాలను కలగజేస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేని పిల్లలపైనా ఈ వైరస్ ప్రభావం వారం రోజులపాటు కొనసాగుతుంది. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. ఈ ఫ్లూ వైరస్ ఏటికేడూ కొన్ని మార్పులు చేసుకొని, కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా దానికి తట్టుకొని మనగలుగుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తుంటారు.
వర్షాలు మొదలయ్యే సీజన్లో పిల్లలకు దీన్ని ఇప్పించాలి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే జూన్, జూలై మాసాల్లో ఈ టీకా తీసుకోవడం మంచిది. ఆస్తమా, గుండెజబ్బులు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలు ఉన్న చిన్నారులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు, చిన్నవయసులోనే శస్త్రచికిత్స జరిగినవాళ్లు, కొన్ని ప్రత్యేకమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ రక్షణగా నిలుస్తుంది.
రిస్క్ ఉన్నవాళ్లకే కాకుండా.. పిల్లలందరికీ వానకాలంలో ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారినుంచి రక్షించుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా.. లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. మొత్తం మీద పిల్లలకు ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించడం చాలా అవసరం. ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. ఈ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల పిల్లలకు వచ్చే సాధారణ జలుబు, జ్వరాలకు అడ్డుకట్ట పడకపోవచ్చు. కానీ, ఇన్ఫ్లుయెంజా వైరస్ తీవ్రతను ఇది తగ్గిస్తుంది.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్