Hair car tips | ఒత్తుగా, పొడవాటి జుట్టు ఉండాలని ప్రతీ ఒక్క మహిళ కోరుకోవడం సర్వసాధారణం. మంచి జుట్టు ఉన్నవారిని చూసి చాలా మంది మనకూ అలా లేదే అని బాధపడుతుంటారు. కాలుష్యం, జీవనశైలి, వాడుతున్న రసాయనాల కారణంగా జుట్టు పలచబడిపోయి రాలిపోతున్నది. అందాన్ని ఇనుమడింపజేసే వెంట్రుకలు ఊడిపోతుంటే మహిళలు పడే బాధ అంతా ఇంతా కాదు. జుట్టు ఊడిపోకుండా ఉండటమే కాకుండా ఒత్తుగా పెరిగాలంటే.. ఉల్లిపాయ రసానికన్నా మించిన ఔషధం లేదంటున్నారు నిపుణులు.
జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్ స్టైల్స్‌ను ఆడవాళ్లు ఫాలో అవుతుంటారు. మరింత అందంగా తయారవుతుంటారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్ స్పెషలిస్టులను పెట్టుకుని నానా తంటాలు పడుతుంటారు.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు. ఉల్లిపాయలో ఉండే పోషక విలువలు వలన మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు రాలడం జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు చుండ్రు, కేరాటిన్ అనే ప్రొటీన్ లోపం వల్ల జరుగుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సల్ఫర్ కేరాటిన్ అవసరం. ఉల్లిపాయ రసంలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఇది కేరాటిన్ అనే ప్రొటీన్ పెంచి చుండ్రుని కూడా తగ్గిస్తుంది. అందుకని ఉల్లిపాయ రసం ఊడిపోయిన జుట్టుని తిరిగి పెంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
వాడే విధానం..
ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు మెల్లగా రాసుకోవాలి.
ఆ తర్వాత 5 నుంచి 6 నిమిషాలు వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి
అనంతరం దాదాపు 15 నిమిషాలు అలా వదిలేయండి.
ఇప్పుడు తేలికపాటి షాంపుతో తలస్నానం చేయండి.
కలిపే విధానం..
2 టేబుల్ స్పూన్ల ఉల్లి రసం, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 5 చుక్కల టీ ఆయిల్ తీసుకుని మూడింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం జుట్టు కుదుళ్లకు రాసుకొని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయడం ద్వారా జుట్టు రాలకుండా ఉంచుకోవచ్చు. అలాగే, ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు.
జుట్టు ఆరోగ్యానికి..
గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ముఖ్యంగా వారానికి రెండు, మూడు సార్లు తలస్నానం చేయాలి. గాఢత తక్కువగా ఉండే షాంపూలను వాడాలి. తడి జుట్టును దువ్వడం చేయరాదు. ధూమపానం మానుకోవాలి. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలను తినాలి. సమయానికి నిద్రపోవాలి. ఇలా ఎన్నో ప్రమాణాలను పాటించడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.