Tongue @ Diseases | మనం డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ముందుగా మన కళ్లు, నాలుకను పరీక్షిస్తారు. ఇలా పరీక్షించడం ద్వారా వారు మన ఆరోగ్యానికి సంబంధించిన కొంత సమాచారాన్ని రాబట్టుకుంటారంట. మనం అనారోగ్యానికి గురవగానే తొలుత మన కళ్లు, నాలుకపైనే ప్రభావం ఉంటుంది. వాటిని జాగ్రత్తగా గమనించడం ద్వారా వైద్యులు మనకు చికిత్స అందిస్తారు. గుండె ఆరోగ్య స్థితిని కూడా నాలుకను గమనించడం ద్వారా గుర్తించవచ్చునంటున్నారు వైద్యులు. మన నాలుకను ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉండగలుగుతామని వైద్యులు సూచిస్తున్నారు. చూయింగ్ గమ్ నమలడం, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ తాగడం వల్ల నాలుకపై బ్యాక్టీరియా పెరిగి రంగు మారే అవకాశాలున్నాయి.
నాలుకను పరిశుభ్రం చేసుకోవడం పట్ల మనలో చాలా మంది శ్రద్ధ వహించరు. ఈ కారణంగా నోటిలో బ్యాక్టీరియా పెరిగిపోయి అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిలో నాలుక లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. మనం తినే ఆహారం కారణంగా కూడా నాలుక రంగు మారుతుంది. అందుకే మనం డాక్టర్ వద్దకు వెళ్లగానే మన నాలుకను పరిశీలించి ఏం తిన్నారని ప్రశ్నిస్తారు. నాలుక రకరకాల రంగుల్లో కనిపిస్తే అనారోగ్యం బారిన పడినట్లుగా భావించాలి.
తెలుపు రంగు
ఇది నోటి పరిశుభ్రత తక్కువగా ఉన్నదని చెప్తుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ కండీషన్‌ను గుర్తుచేస్తుంది. నాలుకపై పూత కనిపిస్తే ల్యూకోప్లాకియాగా అనుమానించాలి. కొన్నిసార్లు ఫ్లూ కారణంగా కూడా నాలుక రంగు తెల్లగా కనిపిస్తుంది.
నలుపు రంగు
సిగరెట్ చైన్ స్మోకింగ్ కారణంగా నాలుక నలుపు రంగులోకి మారుతుంది. క్యాన్సర్, అల్సర్, ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కూడా ఇలాంటి నలుపు రంగు కనిపిస్తుంది. నోటి పరిశుభ్రత లేకపోవడం నాలుకపై బ్యాక్టీరియా ఏర్పడి కూడా నాలుక రంగు నలుపుగా మారుతుంది. ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడే వారిలో నాలుక నలుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది.
ఎరుపు రంగు
నాలుక రంగు ఎరుపుగా ఉన్నట్లయి శరీరంలో ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బీ12 లోపం అని గుర్తించాలి. వైరల్ ఇన్ఫెక్షన్లతో జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎర్రగా మారుతుంది. నాలుకపై ఎర్రటి మచ్చ కనిపిస్తే దానిని జియోగ్రాఫిక్ టంగ్ అంటారు.
నీలి రంగు
నీలం లేదా ఊదా రంగు నాలుకపై కనిపిస్తే గుండె సంబంధ సమస్యలుగా అనుమానించాలి. రక్తాన్ని గుండె సరిగ్గా పంప్ చేయలేకపోయిన సందర్భాల్లో లేదా రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు నాలుక నీలం రంగులోకి మారుతుంది. రక్త ప్రసరణ లోపాలు ఉన్న వారిలో కూడా నాలుక నీలి రంగులో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాలుక నీలి రంగులోకి మారుతుంది.
పసుపు రంగు
నాలుక పసుపు రంగులోకి మారితే పోషకాహారం కొరతగా భావించాలి. అలాగే, జీర్ణవ్యవస్థలో ఆటంకం, కాలేయం సమస్యలు వచ్చినట్లుగా అనుమానించాలి.
గోధుమ రంగు
కెఫిన్ తీసుకునే వ్యక్తుల నాలుక సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. సిగరెట్ స్మోకింగ్ చేసేవారిలో కూడా గోధుమ రంగు నాలుక కనిపిస్తుంది.
అదేవిధంగా, నాలుకపైనా, నోట్లో పుండ్లు ఏర్పడటం రోగ నిరోధక శక్తి తగ్గడానికి సంకేతంగా భావించాలి. నాలుక పాలిపోయి తెల్లగా కనిపిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నదని గుర్తించాలి. ఐరన్ లోపం ఉన్నవారిలో కూడా నాలుక పాలిపోయి ఉంటుంది. నాలుక రంగు ఎక్కువ కాలం పాటు మారకుండా ఉండే వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.