Mental Health Day | మనిషిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే మనసు.. పాతాళానికీ లాక్కెళ్తుంది..
మనసు మహా శక్తిమంతమైంది. మనిషిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మనసు మహా బలహీనమైంది. మనిషిని పాతాళానికి లాక్కెళ్తుంది. మనసుకు రుగ్మత వస్తే.. శరీరమూ ముడుచుకు పోతుంది. ఆలోచనలు పక్కదారి పడతాయి. వ్యక్తిత్వాన్ని మబ్బులు కమ్మేస్తాయి. కాబట్టి, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
- నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
- ‘మానసిక ఆరోగ్యం విశ్వజనీనమైన మానవ హక్కు’ ఈ ఏడాది నినాదం
Mental Health Day | మనసు మహా శక్తిమంతమైంది. మనిషిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మనసు మహా బలహీనమైంది. మనిషిని పాతాళానికి లాక్కెళ్తుంది. మనసుకు రుగ్మత వస్తే.. శరీరమూ ముడుచుకు పోతుంది. ఆలోచనలు పక్కదారి పడతాయి. వ్యక్తిత్వాన్ని మబ్బులు కమ్మేస్తాయి. కాబట్టి, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ’ సందేశమూ ఇదే.
నువ్వు అంటే నీ శరీరం కాదు.. నీ మనసే. మానసిక ఆరోగ్యంతోనే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యం. కెరీర్ పరుగులో పడిపోయి చాలామంది మనసును నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి, సమాజంలోని నేర ప్రవృత్తికి, పౌరుల మానసిక ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. జాతీయ నేర గణాంక విభాగం నివేదిక ప్రకారం.. దేశంలో గంటకో విద్యార్థి తనువు చాలిస్తున్నాడు. ఆడిపాడే వయసులో ఆత్మహత్యలు పెరగ డానికి మానసిక రుగ్మతలే కారణం. సకాలంలో కౌన్సెలింగ్ అందించడం ద్వారా ఈ చావులను నియంత్రించవచ్చు. కాకపోతే, కౌన్సెలింగ్ ఇవ్వడానికి సరిపడా సైకాలజిస్టులు, మానసిక వైద్యులే మనకు కరువయ్యారు. లక్ష జనాభాకు ఆరుగురు మానసిక నిపుణులు ఉండాలి. మన దేశంలో కనీసం ఒక్కరు కూడా లేరు. పది లక్షల జనాభాకు ముగ్గురు, కోటి జనాభాకు నలుగురు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితి మారకపోతే.. విద్యార్థులు, యువత ఆత్మహత్యలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. తొలి దశలోనే మానసిక జాడ్యాలను గుర్తిస్తే .. మనిషి జీవితంలోని అనేకానేక సంక్షోభాలకు సమాధానం దొరికినట్టే. మనసు ఒడ్డ్డున పడినట్టే.
1. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ Paranoid Personality disorder
ఇలాంటివారు సమాజాన్ని అను మానిస్తారు. ఎవర్నీ ఓ పట్టాన నమ్మరు. ప్రతి వ్యక్తినీ దొంగలా చూస్తారు. సర్దుకుపోయే గుణం ఉండదు. చిన్న వైఫల్యం ఎదురైనా తట్టుకోలేరు. ఆ అపజయాన్ని అవమానంగా భావిస్తారు. ఇతరుల సూచనలు, సలహాలు తిరస్కరిస్తారు. వ్యక్తుల పట్ల ద్వేషాలను, అసూయను పెంచుకుంటారు. ఎంతకైనా తెగించే స్వభావం. తామే గొప్పవారమని భావిస్తుంటారు.

2. స్కిజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ Schizoid Personality disorder
కలల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలను అసలు ఇష్టపడరు. ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఉద్వేగాలు తక్కువ. పైపైకి అమాయక చక్రవర్తిలా కనిపిస్తారు. సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి కనబరచరు. ఊహల్నే నిజాలుగా భావిస్తూ బతికేస్తారు.

3. స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్ Schizotypal Personality disorder
అసాధారణమైన, అనూహ్యమైన ప్రవర్తన వీరిది. స్కిజోఫ్రేనియాతో ముడిపడిన ఆలోచనలతో వింతగా వ్యవహరిస్తూ ఉంటారు.
పీడకలలు వస్తున్నట్టు, దయ్యాలు వెంబడిస్తున్నట్టు, ఎవరికీ వినిపించని మాటలు తమకు మాత్రమే వినిపిస్తున్నట్టు.. ఊహించుకుంటారు. ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆందోళనలతో మానసిక అనారోగ్యాన్ని కొనితెచ్చుకొంటారు. ఇతరులు తమకు హాని చేస్తున్నారని అపోహ పడటం, సామాజిక సంబంధాలకు దూరం కావడం, చేతల్లో విపరీత ధోరణి.. ప్రాథమిక లక్షణాలు.

4. యాంటీసోషల్ లేదా డిస్సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ Antisocial or Dissocial Personality disorder
సమాజంలో ఎవరి భావాలనూ పట్టించుకోరు. ప్రతి చిన్న విషయానికీ విసుగు చెందుతారు. దూకుడుగా ప్రవర్తిస్తారు. నేరాలకు పాల్పడతారు. సన్నిహిత సంబంధాలు ఇష్టపడరు. సభ్య సమాజం ఆమోదించని అనైతికమైన పనులు చేస్తుంటారు.

5. బార్డర్లైన్, ఎమోషనల్లీ అన్ స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్ Borderline or Emotionally Unstable Personality disorder
క్షణికమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వ్యక్తిత్వంలో స్థిరత్వం ఉండదు. తోటి వ్యక్తులతో శాశ్వత సంబంధాలు కోరుకోరు. తమను ఎవరూ గుర్తించడం లేదని ఆందోళన చెందుతారు. హఠాత్తుగా కోపంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఆగ్రహావేశాలతో ఊగిపోతారు. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. సాధారణంగా, బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన వారు ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మహిళలైతే ఒకే భాగ స్వామితో ఎక్కువకాలం కలిసి ఉండలేరు.
6. హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ Histrionic Personality disorder
నాటకీయ ప్రవర్తన వీరిది. ఎవరినైనా ఆకర్షించగలమని, తమ వైపు ఇట్టే తిప్పుకోగలమని భ్రమిస్త్తూ ఉంటారు. ప్రతిసారీ ఎగ్సైట్మెంట్ను ఆశిస్తారు. ఆ ప్రయత్నంలో ప్రమాదాల్లో పడుతూ ఉంటారు. తమకు ఏదైనా దక్కకపోతే తట్టుకోలేరు. ఎవరైనా విమర్శిస్తే తీవ్రంగా ఆందోళన చెందుతారు. హింసా మార్గాన్ని ఎంచుకొంటారు. తరచూ సమస్యలు సృష్టించుకుంటారు. దుర్బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు.

7. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ Narcissistic Personality disorder
అహంకారపూరిత వ్యక్తిత్వం. ఇతరులు తమతో పోల్చుకుని పొగిడినా తట్టుకోలేరు. ‘నా అంతటి వాడితో పోలికా’ అనే భావన బలంగా ఉంటుంది. స్వార్థం ఎక్కువ. అబద్ధ్దాలు ఆడతారు. ఎదుటివారిని దోచు కునేందుకు సైతం వెనుకాడరు. ఎవరైనా తమపై జోకులు వేస్తే తట్టుకోలేరు. తీవ్రంగా స్పందిస్తారు. ప్రతీకారానికి ఎంతకైనా తెగిస్తారు. విధ్వంసపూరిత ప్రవర్తన వీరిది.

8. అబ్సెసివ్-కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ Obsessive-Compulsive Personality disorder
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి విషయాన్నీ సందేహిస్తూ అతి జాగ్రత్తలు పాటిస్తారు. కఠినత్వం ఎక్కువ. ప్రతి విషయంలోనూ తమను తాము నియంత్రించుకుంటూ ఉంటారు. తమకు ఏ మాత్రం లోపం జరిగినా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. మార్పును ఇష్టపడరు.

9. అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ Avoidant Personality disorder
ఎలాంటి ప్రత్యేకతలూ కనిపించవు. ఆత్మ విశ్వాసం తక్కువ. యాంగ్జయిటీ డిజార్డర్తో బాధ పడుతుంటారు. సమాజాన్ని తప్పించుకోవటానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులకు దూరంగా పెరగడం, స్నేహితులు దగ్గరకు రానీయకపోవడం..సమస్యకు మూలాలు.
10. డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్ Dependent Personality disorder
ఆత్మవిశ్వాసం తక్కువ. ప్రతి విషయంలో ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. నిస్సహాయస్థితిలో ఉన్నామని, అసమర్థులమనీ ఒప్పుకొంటూ.. తాము తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఇతరులపైకి నెట్టివేస్తూ, ఇతరులే తమ తరపున నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు. తమను దోచుకోవడానికి, మోసం చేయడానికి కూడా అవకాశం కల్పిస్తారు. తాడు చేతికి ఇచ్చి చేతులు కట్టించుకునే రకం. స్వతహాగా పరాధీన స్వభావం.
సరిదిద్దుకోవడం ఎలా..
దిగాలుకు దిక్కు లేదు, మనాదికి మందు లేదనేది సామెత. ప్రస్తుతం దిగాలుకు దిక్కు ఉంది, మనాదికి మందూ ఉంది. ఆధునిక పరిశోధనలతో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తున్నది. పట్టుదల, మానసిక దృఢత్వం ఉంటే లోపాలను సరిదిద్దుకోవచ్చు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం నిర్మించుకోవచ్చు. వ్యక్తుల ప్రవర్తనా లోపాలను గుర్తించడం చాలా సంక్లిష్టమైనదే. అయినా మానసిక నిపుణులు తమ పరిధికి లోబడి మనో రుగ్మతలను విశ్లేషిస్తున్నారు. సంభాషణలు, పరీక్షల ద్వారా.. వ్యక్తిత్వ లోపాల మూలాలను గుర్తిస్తున్నారు. పరిష్కారాన్నీ అందిస్తున్నారు. కంటికి ఓ వైద్యుడు, పంటికి ఓ వైద్యుడు ఉన్నట్టే.. మానసిక నిపుణులూ ఉన్నారనీ.. అవసరమైతే వారిని సంప్రదించ వచ్చని ప్రజలు గుర్తిస్తే చాలు. సగం మానసిక రుగ్మతలు తగ్గిపోతాయి.
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్
ఫోన్: 9703935321
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

