Fat Loss tips | శరీరం బరువును, ఒంట్లో కొవ్వును తగ్గించుకోవాలని మనలో చాలా మంది ఈ కొత్త సంవత్సరం వేళ తీర్మానం చేసుకుని ఉంటారు. నిజమే కదూ..! అయితే, కొవ్వు పెరగకుండా నిరోధించడం ఏమంత పెద్ద పనికాదు. కొందరు బరువు తగ్గడానికి కష్టపడుతూ అదే తగ్గిపోతున్న బరువుతో అనేక చిక్కులు ఎదుర్కొంటుంటారు. అలాకాకుండా, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులతో మన శరీరం బరువుతోపాటు కొవ్వులను అదుపులో పెట్టుకోవచ్చు. కొన్ని సూత్రాలను పాటించడం ద్వారా శరీరంలో కొవ్వులను నిరోధించవచ్చు. అవేంటంటే..
క్యాలరీలు తక్కువుండేవి తినాలి..
శరీరంలోని కొవ్వులను తగ్గించుకోవాలంటే మొదటి ప్రయత్నం.. మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలను తగ్గించుకోవాలి. అలాంటి డైట్‌ను ఫాలో అవ్వాలి. శరీరం బరువుకు తగినట్లుగా క్యాలరీలు తీసుకోవాలి. మగవారు తమ బరువును 30 తో, ఆడవాడు తమ బరువును 26 తో గుణించాలి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలు ఉంటే 2100 క్యాలరీలకు మించి ఆహారాలను తీసుకోకుండా చూసుకోవాలి. దీని కంటే తక్కువ తీసుకోవడం ద్వారా కొవ్వులు శరీరంలో నిల్వ ఉండవు. వారంలో 200 క్యాలరీలు తగ్గించేలా చూసుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. అంటే తొలి వారంలో 2100 క్యాలరీల నుంచి 1900 కు, మరుసటి వారంలో 1700 కు.. అలా తగ్గిస్తూ రావాలి. ఎంత త్వరగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకునే దానిపై క్యాలరీల తగ్గింపు ఆధారపడి ఉంటుంది.
జీవక్రియలను పెంచుకోవాలి..
మెటబాలిజం అనేది శరీరం మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. జీవక్రియలు శక్తిని మార్చడమే కాకుండా శరీరానికి రోజువారీ పనిచేసేందుకు అవసరమైన ఇంధనాన్ని కూడా అందిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే జీవక్రియలను పెంచుకోవాలి. నిత్యం ఒకే సమయంలో భోజనం చేయడాన్ని అలవర్చుకోవడం ద్వారా జీవక్రియలను పెంచుకోవచ్చు. అలాగే నిత్యం అర్ధ గంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.
రసాలు కాకుండా పండ్లు తినాలి..
శరీరం బరువు తగ్గేందుకు ఘన ఆహారాలకు బదులుగా ద్రవాలు తీసుకోవాలని చాలా మంది సలహా ఇస్తుంటారు. నిజానికి పండ్లరసాల్లో అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉండవు. పండును రసంగా చేసినప్పుడు దానిలోని విటమిన్లు, ఖనిజాలు గుజ్జుతో పాటు బయటకు వెళ్లిపోయి కేవలం రంగు నీరు మాత్రమే మిగులుతుంది. రసాల రూపంలో కాకుండా పండ్లను తినడం ద్వారా ఎక్కువ పోషకాలు శరీరానికి అంది ఎక్కువ సమయంపాటు ఆకలిని నిరోధిస్తాయి. దాంతో శరీరం బరువు తగ్గడమే కాకుండా క్యాలరీలు కూడా తగ్గిపోతాయి.
రోజంతా చురుకుగా ఉండాలి..
రోజంతా ఏదో ఒక పనిచేస్తూ ఉండటం ద్వారా మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది క్యాలరీలను బర్న్ చేయడానికి మంచి మార్గం. గుండె కొట్టుకునే రేటును పెంచే వ్యాయామాలను ఎంచుకోవడం కూడా ఉత్తమం. రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్.. ఇలా ఏదో ఒక పని చేయడం ద్వారా రోజంతా చురుకుగా ఉండేలా చూసుకుంటే కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా శరీరం బరువు కూడా తగ్గుతుంది.
ఎక్కువ సమయం నిద్రపోవాలి..
మనం ఆరోగ్యంగా ఉండటంలో నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా గాడ్జెట్లపై టైంపాస్ చేయడం వల్ల నిద్రలేమి సమస్యలకు లోనవాల్సివస్తుంది. ఫలితంగా శరీరంలోకి పంపించే క్యాలరీలు బర్న్ కాకుండా ఉండిపోతాయి. సరైన నిద్ర లేకపోవడం కూడా శరీరం బరువును పెంచడానికి కారణమవుతుంది. అందుకని కనీసం 7 గంటల సమయం నిద్ర పోయేలా ప్లాన్ చేసుకోవాలి. నిత్యం ఒకే సమయానికి నిద్ర పోవడం, ఒకే సమాయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం.
చివరగా.. మనం తినే ఆహారాలు మన శరీరంలో ఉండే కొవ్వును ప్రభావితం చేస్తాయి. అందుకని తినే ముందు ఆహార పదార్థాలను చూసుకోవాలి. ఈజీగా బరువు పెరిగేందుకు దోహదం చేసే ఆహారాలను పక్కన పెట్టాలి. అధిక కొవ్వుకు కారణమయ్యే ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌ను తగ్గించుకునేందుకు డెయిరీ పదార్థాలను దూరం పెట్టాలి. అలాగే ఇన్సులిన్‌ను కూడా తగ్గించుకోవాలి. అందుకు చక్కెరలను తినడం పూర్తిగా మానుకోవాలి. థైరాయిడ్ వంటి యాంటీబాడీలు కూడా శరీరంలో కొవ్వు పెరిగేందుకు దోహదపడుతుంది. అందుకు గ్లూటెన్ ఉండే పదార్థాలను తినకుండా చూసుకోవాలి. ఇందుకు గోధుమలు, గోధుమ ఉత్పత్తులను తినకుండా నిషేధం పెట్టుకోవాలి.