Supplements | ఇటీవలికాలంలో ఎవర్ని కదిపినా విటమిన్ల లోపాలు బయటపడుతున్నాయి. సరైన ఆహారాలను తీసుకోకపోవడం కారణంగా విటమిన్ లోపం కనిపిస్తుంటుంది. ఈ విటమిన్ల లోపాన్ని భర్తీ చేసేందుకు చాలా మంది సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం విటమిన్ ట్యాబ్లెట్లు చాలా ముఖ్యమని భావిస్తుంటారు. అలా అని అన్ని రకాల సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరమా? ఆరోగ్యంగా ఉన్నవారు సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా? అనే సందేహాలు చాలా మంది మదిని తొలిచేస్తున్నాయి.
ఫిట్నెస్ సప్లిమెంట్లులో ప్రోటీన్ పౌడర్లు, మల్టీవిటమిన్లు అలాగే ఇతర ముఖ్యమైన ఖనిజాలు, ఒమెగా ఉన్నాయి. ఎవరైనా ఒక్కసారి సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభిస్తే.. వారు తమ రోజూవారి అవసరాలకు వాటిపైనే ఆధారపడతారు. సహజమైన ఆహారాలను తినడం మానేస్తారు. ఏదైనా ఔషధం గానీ, ప్రోటీన్ పౌడర్లుగానీ ఎక్కువ కాలం పాటు తీసుకుంటే అవి మన శరీరంలోని అవయవాలు ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నది మరిచిపోవద్దు. అందుకని సప్లిమెంట్లను తీసుకోవాలని అనుకునేవారు కొన్ని విషయాలపై తప్పనిసరిగా దృష్టిసారించడం అవసరం.
ఏదైనా పరివర్తనకు పునాది ఆహారంలో మార్పులు చేయడమో లేదా వ్యాయామమో కాదు. అంతర్గత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. తినేది ఏ ఆహారమైనా కాలేయం గుండా వెళ్తుంది. అందుకని కాలేయం మంచి పని స్థితిలో ఉండటం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలు సాధారణంగా మారినట్లయితే సప్లిమెంట్లను తీసుకోవడం గురించి ఆలోచించాలి.
సప్లిమెంట్ అనేది మన ఆరోగ్యం, మొత్తం శరీర పనితీరును మెరుగుపరచడానికి తీసుకునేది. రోజువారీగా మార్కెట్లోకి కొత్త కొత్త సప్లిమెంట్లు వస్తున్నాయి. స్వల్పకాలిక ప్రయోజనాలను అందించే అనేక తక్కువ-ధర సప్లిమెంట్లు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలిగిస్తుంటాయి. సప్లిమెంట్స్ అనేవి రోజూ మన శరీరంలో ఉండేవి అని మరిచిపోవద్దు. అందుకని సప్లిమెంట్లు కొనడంపై రాజీ పడొద్దు. వీటి ధరపై రాజీ అంటే ఆరోగ్యంపై రాజీ పడటమే.
డైట్ – వర్కౌట్ రొటీన్ పాయింట్లో ఉన్నప్పుడు మాత్రమే సప్లిమెంట్స్ ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే ఒత్తిడి లేని జీవనశైలిని గడపగలుగుతాం. సప్లిమెంట్లను మాత్రమే తీసుకోవడం, సహజ ఆహారాలను విస్మరించడం వలన కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఇతర అవయవాల ఆరోగ్యానికి హాని కలిగేలా చేస్తుంది. అంతేకాకుండా మంచి బడ్జెట్ ఉంటేనే సప్లిమెంట్ల వైపు చూడాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో కొని పెట్టుకోవద్దు. అదే సమయంలో సప్లిమెంట్లకు సంబంధించి మనకు అందిన సమాచారం విశ్వసనీయమైనదని మరోసారి నిర్ధారించుకోవాలి.
సాధారణంగా వారంలో కోల్పోయిన శక్తిని వీకెండ్లో పొందుతాం. తద్వారా సోమవారం మరింత శక్తితో పని చేయడానికి తిరిగి వస్తాం. అలాగే, మన శరీర వ్యవస్థకు కూడా విరామం ఇవ్వాల్సిందే. ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, సప్లిమెంట్లు ఇవ్వడం నుంచి కూడా విశ్రాంతి ఇవ్వాలి. 3 నెలలకు మించి సప్లిమెంట్ తీసుకోకుండా చూసుకోవాలి. ఇలా 3 నెలలకు ఒకసారి విశ్రాంతి పొందేలా ప్లాన్ చేసుకోవాలి.
అనవసరంగా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల డబ్బు, సమయం రెండూ వృధా అవుతుంటాయి. సప్లిమెంట్ అనేది ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. మనం ఆహారాల నుంచి విటమిన్లు, ఇతర పోషకాలను పొందలేనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించాలి. మార్కెట్లో ఎన్నో ప్రైమరీ సప్లిమెంట్లు ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ని సంప్రదించడం ద్వారా ఏ సప్లిమెంట్ ఉత్తమం, ఎంత సమయం తీసుకోవాలో సలహా ఇస్తారు. చివరగా వైద్యుడి సూచనల మేరకే సప్లిమెంట్లను వాడటం శ్రేయస్కరం.