Indian Super Foods | విదేశీ సూపర్‌ఫుడ్స్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండానే భారతీయ వంటగదిలోనే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వాడే కొన్ని సాధారణ మసాలా దినుసులు కూడా బెర్రీల వంటి సూపర్ఫుడ్స్కు సమానమైన యాంటీఆక్సిడెంట్ శక్తిని అందించగలవని తాజా సూచనలు వెల్లడిస్తున్నాయి. బెర్రీలు, నట్స్, ఆలివ్ ఆయిల్, ఆకుకూరలు వంటి సూపర్‌ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివని ఫిట్నెస్ నిపుణులు తరచూ సూచిస్తుంటారు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి.
అయితే ఇంట్లోనే ఉండే జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం వంటి మసాలాలు కూడా శరీరానికి సమానంగా మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. సరైన మసాలాలను కేవలం అర టీస్పూన్ మోతాదులో తీసుకున్నా ఒక బౌల్ బెర్రీలకు సమానమైన యాంటీఆక్సిడెంట్ శక్తిని పొందవచ్చని చెబుతున్నారు. ఈ ప్రత్యేక మిశ్రమంలో అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక చిటికెడు లవంగం పొడి ఉంటాయి. ఈ కలయిక జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీర మెటబాలిజాన్ని కూడా బలోపేతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. లవంగంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ గుణాలు ఉండటంతో శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇక ఈ మసాలా మిశ్రమాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. అలాగే భోజనం మీద చల్లి తీసుకోవచ్చు లేదా రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు.
ఈ మిశ్రమం పరిమాణంలో చిన్నదైనా శరీర కణాల స్థాయిలో పనిచేసి మెటబాలిక్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం కంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడమే ముఖ్యమని సూచిస్తున్నారు. సరైన ఆహార ఎంపికలు ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయని, ఆరోగ్య సంరక్షణ ఎప్పుడూ క్లిష్టంగా ఉండాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.