Health Tips | రోడ్డు మీద నడుస్తున్నప్పుడు.. నదీతీరంలో సేద దీరుతున్నప్పుడు.. లేదంటే గాలి బలంగా వీచినప్పుడు.. కండ్లలో నలుసు పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. కనీసం కండ్లు తెరవడానికి కూడా వీలుపడదు. వీలైనంత తొందరగా ఆ నలుసును వదిలించుకోవాలని అనుకుంటాం. కానీ, ఎలా తొలగించుకోవాలి? అనేదే ప్రశ్న. నలుసు చిన్నదైతే చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు. పెద్దదైతే వైద్యుడిని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం.. సమస్యలు చుట్టుముడతాయి. నలుసు చిన్నదైనా, పెద్దదైనా చేతితో కండ్లు రుద్దుకోకూడదు.
చల్లటి నీళ్లలో కండ్లను రెపరెపలాడించాలి.
కన్నీళ్ల ద్వారా నలుసు బయటికి వెళ్లిపోయే వరకు కండ్లు కొడుతూనే ఉండాలి.
కంటి పైరెప్పను లాగి.. కింది రెప్ప మీద ఉంచాలి. తర్వాత కండ్లను తిప్పుతూ ఉండాలి. ధూళికణం పోయేవరకు అలా చేస్తూనే ఉండాలి.
దూది సాయంతో.. నలుసు బయటికి వెళ్లేలా నెమ్మదిగా తుడవమని ఎవరినైనా అడగాలి.
తెల్లటి, మెత్తటి కాటన్ వస్త్రం తీసుకుని, దాన్ని శుభ్రమైన నీటిలో ముంచాలి. ఆ తర్వాత కార్నియాకు తాకకుండా.. కంటి పక్కల మృదువుగా ఒత్తాలి. ఇలా చేస్తే నలుసు నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
ఈ చిట్కాలను పాటించినా కూడా సమస్య అలానే ఉంటే మాత్రం.. కంటి వైద్యుడిని సంప్రదించాలి. తగిన చికిత్స చేయించుకోవాలి. శరీరంలో అతి సున్నితమైన భాగం కండ్లు. ఈ విషయం మరిచిపోకూడదు.