కొందరు తల్లిదండ్రులు.. తమ ఆహారపు అలవాట్లను పిల్లలపైనా రుద్దుతారు. శాకాహారులైతే.. మాంసా హారాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఇక వీగన్లు.. పాలు, పెరుగు లాంటివి కూడా పిల్లలకు అందివ్వరు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలకు తగినంత ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, అవసరమైన కొవ్వులు అందుతున్నాయా? లేదా? అనేది కూడా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఎలాంంటి డైట్ పాటిస్తున్నా.. పిల్లల పోషకాహార అవసరాల్లో లోటుపాట్లు రానివ్వొద్దని అంటున్నారు.
శాకాహారం: పాలు, పెరుగు, పనీర్, పప్పుధాన్యాలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలతో.. వారి ఆహారం సమతుల్యంగానే ఉంటుంది. అయితే, కేవలం రొట్టెలు, అన్నం, బంగాళాదుంపలు, ప్యాక్ చేసిన స్నాక్స్పైనే ఆధారపడితే.. వారిలో, కొన్ని పోషకాలు లోపించవచ్చు. ఇలాంటి వారు ఐరన్, విటమిన్ బి12, విటమిన్ డి, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
వీగన్: ఈ విధానంలో పిల్లల పెరుగుదల సాధ్యమే! అయితే, తీవ్రమైన పోషకాహార లోపం ఎదురయ్యే అవకాశం ఎక్కువ. వీరు విటమిన్ బి12, క్యాల్షియం, అయోడిన్, జింక్, విటమిన్ డి, ఒమేగా-3 వంటి పోషకాలు తగినంత అందేలా.. పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి. అదనపు విటమిన్లు, ఖనిజాలు కలిగిన రోజువారీ ఆహారాలతోపాటు పీడియాట్రీషియన్ పర్యవేక్షణలో
సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి.
మాంసాహారం: గుడ్లు, పాలు, చేపలు, మాంసం ద్వారా.. వీరికి ప్రొటీన్, ఐరన్, బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి సులభంగా అందుతాయి. అయితే ఈ వెసులుబాటు ఉన్నంత మాత్రాన సంపూర్ణ పోషణ లభించినట్లు కాదు. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ (నగ్గెట్స్, ఇన్స్టంట్ నూడుల్స్, శీతల పానీయాలు) ఎక్కువగా తీసుకుంటే.. అది అసలుకే ఎసరు తెస్తుంది.