Turmeric Milk | పసుపును మనం నిత్యం వంటల్లో వేస్తూనే ఉంటాం. దీన్ని ఎంతో కాలంగా మనం వంటి ఇంటి పదార్థంగానే కాక ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాం. గాయాలు అయినప్పుడు ఎక్కువగా పసుపు రాస్తుంటారు. దీంతో యాంటీ సెప్టిక్లా పనిచేస్తుంది. గాయం త్వరగా మానడమే కాకుండా, ఇన్ఫెక్షన్ అవకుండా అడ్డుకుంటుంది. ఇదే కాకుండా పసుపుతో ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అలాగే పాలను కూడా చాలా మంది రోజూ తాగుతూనే ఉంటారు. అయితే రాత్రి పూట పాలలో పసుపును కలిపి తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పసుపు కలిపిన పాలనే గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. ఈ మిశ్రమం పలు వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పూట ఈ పాలను తాగడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవడంతోపాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
పసుపు పాలలో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ పాలను సేవిస్తే కణజాల స్థాయిలో వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలను తాగడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులు సైతం తగ్గిపోతాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. పసుపులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడతుంది. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
పసుపు కలిపిన పాలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి వ్యాధులు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలపై శరీరం పోరాటం చేస్తుంది. గొంతు నొప్పి, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు. పసుపు కలిపిన పాలను తాగితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పైత్య రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వులను శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. పసుపు కలిపిన పాలను తాగుతుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
పసుపులో ఉండే కర్క్యుమిన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు కణాలు కొత్తగా ఏర్పడేలా చేస్తుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్తేజంగా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. కర్క్యుమిన్ యాంటీ డిప్రెసెంట్‌గా కూడా పనిచేస్తుంది. అందువల్ల పసుపు పాలను తాగితే మూడ్ మారుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. ఇలా పసుపు పాలు మనకు అనేక విధాలుగా మేలు చేస్తాయి. కనుక ఈ పాలను రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.