Arthritis Pains | చలికాలంలో తీవ్రతరం అయ్యే అనారోగ్య సమస్యల్లో ఆర్థరైటిస్ కూడా ఒకటి. చల్లని ఉష్ణోగ్రతలు నొప్పిని, సున్నితత్వాన్ని పెంచుతాయి రక్తప్రవాహాన్ని తగ్గిస్తాయి. దీంతో కండరాలు, కీళ్లు బిగుతుగా అనిపిస్తాయి. చలికి శరీరం ప్రతిస్పందించి ఎక్కువ తాపజనక అణువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది కీళ్ల అసౌకర్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. రోజువారి పనులు చేసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనం, అవపాతం, గాలివేగం వంటి వాతావరణ పరిస్థితులు కూడా కీళ్ల నొప్పులను ప్రభావితం చేస్తాయి. నొప్పిని, లక్షణాలను తగ్గించడానికి మందులు వాడినప్పటికీ వాపులను తగ్గించడానికి మాత్రం సరైన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. రోజువారి ఆహారంలో భాగంగా ఆలివ్ నూనెను తీసుకోవడం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన ఆహారాలను తీసుకోవడం, పండ్లు, కూరగాయలను తీసుకోవడం చేయాలి. ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
నీటిని ఎక్కువగా తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చలికాలంలో కీళ్ల సమస్య మరింత పెరగకుండా ఉంటుంది. శోథ నిరోధక లక్షణాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆహారంలో భాగంగా ఆలివ్ నూనెను వాడడం వల్ల చలికాలంలో కీళ్ల నొప్పులు, వాపు తగ్గుతాయి. ఆలివ్ నూనెను తీసుకోవడం వల్ల శరీరం ప్రతిస్పందనలు తగ్గి కీళ్ల అసౌకర్యం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆలివ్ నూనెలో ఒలియోకాంతల్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శోథ నిరోధక మందుల లాగా ఎంజైమ్ మార్గాలపై పని చేస్తుంది. అలాగే దీనిలో శోథ నిరోధక లక్షణాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. రోజూ రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెను తీసుకోవడం వల్ల కీళ్ల వాపు, నొప్పు వంటి సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఆలివ్ నూనెతో పాటు యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కలిగిన ఇతర ఆహరాలను తీసుకోవడం వల్ల చలికాలంలో ఆర్థరైటిస్ సమస్య మరీ ఎక్కువ కాకుండా ఉంటుందని కూడా వారు తెలియజేస్తున్నారు. ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల కీళ్లల్లో మంట తగ్గుతుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. అలాగే అల్లం తేలికపాటి శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉండడంతో పాటు బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కీళ్లల్లో కలిగే అసౌకర్యం తగ్గుతుంది. పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది వాపులతో పోరాడడంలో మనకు సహాయపడుతుంది. వంటల్లో వాడడంతో పాటు పాలల్లో కలిపి పసుపును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వాల్నట్స్, చియాగింజలు, అవిసె గింజలు కూడా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అందిస్తాయి. అల్పాహారంలో, సలాడ్లలో లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్యంతో పాటు శరీర మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బెర్రీలు, ఆకుకూరలు, బెల్ పెప్పర్ లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా కీళ్ల కణజాలం దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి.