Red Wine | మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది మద్యం సేవిస్తుంటారు. కొందరు రోజూ మద్యాన్ని ఉద్యమంలా సేవిస్తుంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా.. ఎందులోనూ అతి పనికి రాదు. మోతాదులోనే ఉండాలి. అలాగే మద్యానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. మోతాదులో మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హాని కలగదని డాక్టర్లు సైతం చెబుతుంటారు. అయితే మద్యంలో రెడ్ వైన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు అంటున్నారు. అప్పుడప్పుడు 1 లేదా 2 పెగ్గుల రెడ్ వైన్ సేవిస్తే అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు. రెడ్ వైన్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రెడ్ వైన్‌ను తరచూ తాగే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది.
రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో రెస్వెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్త నాళాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. శరీరంలోని ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతుంది. దీంతో రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా ఉంటాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా గుండెను రక్షించుకోవచ్చు. రెడ్ వైన్ ను తరచూ తాగడం వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయని, రక్త సరఫరా మెరుగు పడుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. రెడ్ వైన్‌ను తాగితే ఎముకలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే సిలికాన్ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
రెడ్ వైన్‌ను తరచూ తాగే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా గ్రహించేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రెడ్ వైన్‌ను తరచూ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెడ్ వైన్‌లో మన మెదడుకు మేలు చేసే అనేక సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల ఈ వైన్‌ను తరచూ తాగుతుంటే మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
రెడ్ వైన్‌లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ కాంతి పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. రెడ్ వైన్‌ను తాగేటప్పుడు ఏవైనా ఆహారాలను తింటే షుగర్ లెవల్స్‌ను నియంత్రించవచ్చు. ఆ ఆహారం తాలూకు గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ అంతగా పెరగవు. రెడ్ వైన్‌ను తాగడం వల్ల జీర్ణ క్రియ సైతం మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఆరోగ్యకరం అయినప్పటికీ మనవాళ్లు దేన్నీ తక్కువగా తీసుకోరు. ఎక్కువగానే తీసుకుంటారు, దీంతో లేని పోని సమస్యలను తెచ్చుకుంటారు. కనుక ఏది తీసుకున్నా మితంగానే తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేదంటే రోగాల బారిన పడతారు.