Ginger And Turmeric | పసుపు, అల్లం ఒకే జాతికి చెందినవి. వీటి కొమ్ములు (వేర్లు) ఒకే రకంగా ఉంటాయి. ఇవి Zingiberaceae అనే జాతికి చెందిన వేరు మొక్కలు. ఇవి రెండూ దాదాపుగా ఒకే రకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని మనం వంటల్లో రోజూ వాడుతూనే ఉంటాం. అయితే ఈ రెండింటి కాంబినేషన్ ఎంతో శక్తివంతమైందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పసుపు, అల్లాన్ని కలిపి రోజూ తీసుకుంటే అనేక లాభాలు ఉంటాయని అంటున్నారు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇందులో జింజరాల్తోపాటు కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి మనకు కలిగే వ్యాధులను నయం చేయడంలో ఎంతో సహాయం చేస్తాయి. అందువల్ల ఈ రెండింటి మిశ్రమాన్ని రోజూ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పసుపు, అల్లం మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వాటిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఆర్థరైటిస్ సమస్యను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రోజూ తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. దీని వల్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు సైతం తగ్గిపోతాయి. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి కణాలను రక్షిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీని వల్ల క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఈ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక దీన్ని తింటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఈ మిశ్రమంలో సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. జ్వరం నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. కనుక ఈ సీజన్లో ఈ మిశ్రమాన్ని మరిచిపోకుండా రోజూ తినాలి. దీన్ని తింటే జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. వికారం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. పైత్య రసం సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల పోషకాహార లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.
పసుపు, అల్లం మిశ్రమాన్ని తింటుంటే హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తింటే బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం పసుపు, అల్లం మిశ్రమంలో న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. అంటే ఈ మిశ్రమాన్ని తింటే మెదడు సైతం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. మెదడులో ఉండే వాపులు తగ్గిపోతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మెదడు యాక్టివ్గా మారి చురుగ్గా పనిచేస్తుంది. బద్దకం పోతుంది. రోజూ చిన్న అల్లం ముక్కను కాస్త దంచి అందులో కొద్దిగా పసుపు కలిపి తినవచ్చు. లేదా నీటిలో ఈ రెండింటినీ వేసి మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు. ఇలా పసుపు, అల్లం మిశ్రమం మనకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.