Ghee With Chapati | ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలా మంది రోజూ చపాతీలను తింటుంటారు. రాత్రి పూట అన్నం మానేసి చపాతీలను తింటే బరువు తగ్గుతారని, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయని చాలా మంది రాత్రి పూట కేవలం చపాతీలను మాత్రమే తింటుంటారు. అయితే ఇది వాస్తవమే అయినప్పటికీ చపాతీలపై నెయ్యి రాసి తింటే ఇంకా ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నెయ్యిని మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీంతో అనేక రకాల స్వీట్లను తయారు చేస్తారు. పలు కూరల్లో, బిర్యానీ వంటకాల్లోనూ నెయ్యిని వేస్తుంటారు. అయితే చపాతీలపై నెయ్యిని రాసి తింటే ఎంతో రుచిగా ఉండడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చపాతీలను ఈ విధంగా తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.
సాధారణంగా చపాతీలను గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్, సంక్లిష్టమైన పిండి పదార్థాల కారణంగా కొందరికి చపాతీలను తింటే సరిగ్గా జీర్ణం కావు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అయితే చపాతీలను కాల్చేటప్పుడు వాటిపై కాస్త నెయ్యిని వేసి కాల్చాలి. అలా తయారు చేసిన చపాతీలను తినాలి. ఇలా చపాతీలను తింటే సులభంగా జీర్ణం అవుతాయి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడవు. నెయ్యిలో బ్యుటైరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్యుటైరేట్ వల్ల జీర్ణాశయం, పేగుల గోడలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
చపాతీలకు నెయ్యిని రాయడం వల్ల చపాతీల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా వరకు తగ్గుతుంది. నెయ్యిలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వుల కారణంగా చపాతీల్లో ఉండే పిండి పదార్థాలు రక్తంలో నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరగకుండా ఉంటాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి కనుక ఇవి మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. నెయ్యిలో ఉండే శాచురేటెడ్ కొవ్వులతోపాటు ఒమెగా 3, ఒమెగా 3 కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె కండరాలు, రక్త నాళాల వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కొవ్వులు శరీరానికి నిరంతరం శక్తి అందేలా చూస్తాయి. జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేలా పనిచేస్తాయి. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ చేస్తుంది.
నెయ్యిలో విటమిన్లు ఎ, డి, ఇ, కె అధికంగా ఉంటాయి. అందువల్ల చపాతీలపై నెయ్యిని రాసి తింటే వాటిల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం ఉండదు. నెయ్యిలో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాల్లో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చపాతీలపై నెయ్యిని రాసి తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణకు కావల్సిన పోషకాలు అధికంగా లభిస్తాయి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి. నెయ్యి వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ దీన్ని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. రాత్రి పూట చపాతీలను తింటారు కనుక ఒక టీస్పూన్ కు మించి నెయ్యిని తినకూడదు. ఇలా చపాతీలను నెయ్యితో కాల్చి తింటే అనేక లాభాలను పొందవచ్చు.