Fish Oil Capsules | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల పోషకాలు అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అనేక విటమిన్లు, మినరల్స్ మనకు అవసరం అవుతుంటాయి. అలాగే మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. ఇవి అనేక జీవక్రియల నిర్వహణకు అవసరం అవుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు ఎక్కువగా విత్తనాలు, గింజల్లో, అవకాడో వంటి పండ్లలో లభిస్తాయి. అలాగే చేపల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అయితే చేపలను తినలేని వారి కోసం ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ క్యాప్సూల్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. డాక్టర్ సలహా మేరకు ఈ క్యాప్సూల్స్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్యాప్సూల్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మాత్రమే కాకుండా ఇంకా ఇతర పోషకాలు కూడా అనేకం ఉంటాయి. ఈ క్రమంలో ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె పోటు రాకుండా చూస్తాయి. అలాగే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఈపీఏ, డీహెచ్ఏ అనే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ రాకుండా చూడవచ్చు. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌లో విటమిన్ డి సైతం ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం తిన్న ఆహారాల్లో ఉండే క్యాల్షియంను శరీరం శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆస్టియోపోరోసిస్, డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు.
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌లో విటమిన్ ఎ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం ఆరోగ్యంగా మారి కాంతివంతంగా ఉంటుంఇ. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీని వల్ల కణాలు డ్యామేజ్ అవకుండా సురక్షితంగా ఉంటాయి. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌లో సెలీనియం కూడా ఎక్కువగానే ఉంటుంది. సెలీనియం యాంటీ ఆక్సిడెంట్‌లా కూడా పనిచేస్తుంది. ఇది కణాలు డ్యామేజ్ అవకుండా రక్షిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌లో అయోడిన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తుంది. మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. గర్భిణీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పొట్టలోని శిశువు ఎదుగుదలకు సహాయ పడుతుంది. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌లో కోలిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండా చూసుకోవచ్చు. ఫిష్ క్యాప్సూల్స్ లో ఆస్టాజాంతిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా అడ్డుకుంటుంది. ఇలా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌ను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే డాక్టర్ సలహా మేరకు వీటిని వాడుకోవాల్సి ఉంటుంది.