Apricots | మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ లభిస్తుంటాయి. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కానీ చాలా వరకు అలాంటి డ్రై ఫ్రూట్స్ గురించి చాలా మందికి తెలియదు. వాస్తవానికి అలాంటి డ్రై ఫ్రూట్స్ మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. వాటిని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాంటి వాటిలో యాప్రికాట్స్ కూడా ఒకటి. ఇవి పండ్లుగానే కాక మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయి. యాప్రికాట్స్‌ను ఎక్కువగా పండ్ల స్టాల్స్‌లో, సూపర్ మార్కెట్లలో చూసే ఉంటారు. ఇవి నారింజ రంగులో ఉంటాయి. రుచి పుల్లగా, తియ్యగా ఉంటుంది. అయితే ఈ యాప్రికాట్స్ మనకు అనేక లాభాలను అందిస్తాయి. రోజూ కనీసం నాలుగు యాప్రికాట్స్‌ను తింటే చాలు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
యాప్రికాట్స్‌లో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కళ్లకు తేమను అందిస్తుంది. దీంతో కళ్లు పొడిబారడం, దురదలు పెట్టడం తగ్గుతుంది. కంప్యూటర్ల ఎదుట ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారికి సహజంగానే ఈ సమస్యలు వస్తుంటాయి. కనుక వారు ఈ పండ్లను తింటే కళ్లు పొడి బారడాన్ని తగ్గించుకోవచ్చు. దీంతోపాటు కళ్లలో ఉండే మంట తగ్దిపోతుంది. అలాగే ఈ పండ్లను తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. రేచీకటి తగ్గుతుంది. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలను రాకుండా అడ్డుకోవచ్చు. యాప్రికాట్స్‌లో విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను రక్షిస్తాయి. విటమిన్ సి వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
యాప్రికాట్స్‌లో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి మలాన్ని మెత్తగా చేస్తాయి. దీంతో మలబద్దకం ఉండదు. రోజూ సుఖ విరేచనం అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటివి ఉండవు. యాప్రికాట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వాపుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఈ పండ్లలో ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
యాప్రికాట్స్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. యాప్రికాట్స్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే యాప్రికాట్స్‌ను తినడం వల్ల లివర్ సురక్షితంగా ఉంటుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా డ్రై యాప్రికాట్స్‌ను రోజుకు కనీసం 4 తింటే చాలు, అనేక లాభాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.