Curd And Honey | పెరుగును మనం రోజువారి ఆహారంలో భాగంగా తింటూనే ఉంటాం. చాలా మంది భోజనం చేసినప్పుడు చివర్లో కచ్చితంగా పెరుగును తింటారు. పెరుగుతో భోజనం చేయకపోతే భోజనం తిన్న ఫీలింగ్ రాదని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకనే కచ్చితంగా పెరుగు తింటారు. ఇక తేనెను కూడా మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. ఆయుర్వేద ప్రకారం తేనె అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే రోజూ ఒక కప్పు పెరుగులో కొద్దిగా తేనె కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పెరుగులో తేనె కలిపి తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు.
పెరుగులో తేనె కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. పెరుగులో తేనె కలిపి తింటే జీర్ణాశయంలో ఉండే ఆమ్లత్వం తగ్గుతుంది. అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. పెద్దపేగు ఆరోగ్యంగా ఉంటుంది. వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఈ మిశ్రమంలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
పెరుగు, తేనె మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ మిశ్రమాన్ని తింటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఈ మిశ్రమాన్ని తింటే శరీరంలోని వాపులు సైతం తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ప్రోటీన్ల వల్ల కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ మిశ్రమంలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో అనేక రకాల బి విటమిన్లు కూడా ఉంటాయి. వీటిని శరీరం సులభంగా శోషించుకుంటుంది. ఈ మిశ్రమంలో ఉండే పిండి పదార్థాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. దీని వల్ల ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసిన వారు ఈ మిశ్రమాన్ని తింటే త్వరగా శక్తి లభించి మళ్లీ ఉత్సాహంగా మారుతారు. అయితే పెరుగు, తేనె మిశ్రమం ఆరోగ్యకరమే అయినప్పటికీ అలర్జీలు ఉన్నవారు మాత్రం ఈ మిశ్రమాన్ని తినకూడదు. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు దీన్ని తినాల్సి ఉంటుంది. దీన్ని మధ్యాహ్నం లంచ్ సమయంలో తింటే మంచిది. అలాగే కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగును వాడితే మేలు జరుగుతుంది.