Bulletproof Coffee | రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు చాలా మంది టీ, కాఫీలను అధికంగా సేవిస్తుంటారు. అయితే కొందరు టీ ప్రియులు ఉంటే కొందరు కాఫీ ప్రియులు ఉంటారు. కాఫీలో చాలా మంది బ్లాక్ కాఫీ కూడా సేవిస్తుంటారు. అయితే బ్లాక్ కాఫీలో కాస్త నెయ్యి కలిపి తాగితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా కాఫీలో నెయ్యి కలిపితే దాన్ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. ఈ కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అనేక పోషకాలు కూడా ఈ కాఫీలో ఉంటాయి. కాఫీలో నెయ్యి కలిపి సేవించడం వల్ల శరీరానికి శక్తి నిరంతరం అందుతూనే ఉంటుంది. దీంతో రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. సాయంత్రం అయ్యే సరికి వచ్చే నీరసం, అలసట ఉండవు.
బుల్లెట్ ప్రూఫ్ కాఫీని సేవించడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు ఈ కాఫీని రోజూ తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీని సేవించడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి కాకుండా అడ్డుకోవచ్చు. దీంతో అసిడిటీ తగ్గిపోతుంది. గుండెల్లో మంట నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఈ కాఫీని సేవిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్గా మారుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మానసికంగా నిరంతరాయంగా అప్రమత్తంగా ఉంటారు.
ఈ కాఫీని తాగితే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు సమస్య ఉన్నవారు రోజూ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తాగుతుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే ఇందులో చక్కెర కలపకుండా తాగాల్సి ఉంటుంది. ఈ కాఫీని తాగడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ముఖ్యంగా నెయ్యిలో ఉండే విటమిన్లు ఎ, డి, ఇ, కెలను శరీరం శోషించుకుంటుంది. దీంతో మనకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. విటమిన్ ఎ వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. విటమిన్ డి రోగ నిరోధక శక్తిని మెరుగు పరిచి ఎముకలను బలంగా మారుస్తుంది.
నెయ్యిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. దీంతో చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. నెయ్యిలో ఉండే విటమిన్ కె ఎముకలను బలంగా మార్చడంతోపాటు గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం తగ్గుతుంది. ఇలా కాఫీలో నెయ్యి కలిపి తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే కొందరికి ఈ కాంబినేషన్ పడకపోవచ్చు. ఇది అలర్జీలను కలిగించే అవకాశం ఉంటుంది. కనుక ఫుడ్ అలర్జీలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు ఈ మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.