Bilva Leaves | పరమేశ్వరుడి పూజలో బిల్వ పత్రాలను ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. బిల్వ పత్రాలను సమర్పిస్తే శివుడు అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరంగా కూడా బిల్వ పత్రాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద ప్రకారం బిల్వ పత్రాలను అద్భుతమైన ఔషధంగా చెబుతారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. బిల్వ వృక్షానికి చెందిన ఆకులను ఎక్కువగా ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే ఈ చెట్టుకు చెందిన పండ్లు, వేర్లు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. బిల్వ పత్రాలను ఉపయోగించి జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థకు చెందిన పలు ఔషధాల తయారీలో బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. బిల్వ పత్రాల్లో ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. అంటే విరేచనాల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయన్నమాట. అలాగే జీర్ణ వ్యవస్థను రక్షిస్తాయి.
బిల్వ ఆకులు మలబద్దకానికి కూడా ఔషధంగా పనిచేస్తాయి. బిల్వ ఆకులను, మిరియాలను వేసి మరిగించిన కషాయాన్ని సేవిస్తుంటే విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. దీంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు. బిల్వ ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడి ఆరోగ్యంగా ఉంటుంది. బిల్వ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల షుగర్ ఉన్నవారికి ఈ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. బిల్వ ఆకులను తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అయితే షుగర్ ఉన్నవారు బిల్వ ఆకులను తీసుకుంటే షుగర్ లెవల్స్ మరీ అధికంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక డాక్టర్ సూచన మేరకు మందుల వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది.
బిల్వ పత్రాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను నివారిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. బిల్వ పత్రాల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఈ ఆకుల్లో ఉంటాయి. అందువల్ల తరచూ ఈ ఆకులను తింటే శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బిల్వ పత్రాల్లో హెపాటోప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను తింటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ వాపులకు గురి కాకుండా, డ్యామేజ్ అవకుండా సురక్షితంగా ఉంటుంది. లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. వ్యర్థాలు బయటకు పోతాయి. మద్యం అధికంగా సేవించే వారు మద్యం మానేసి బిల్వ పత్రాలను తింటుంటే లివర్ పూర్తి స్థాయిలో మరమ్మత్తులకు గురవుతుంది. మళ్లీ పూర్వంలా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. బిల్వ పత్రాలను తీసుకోవడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. రక్తంలో ఉండే మలినాలు, కొవ్వు, వ్యర్థాలు బయటకు పోతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా బిల్వ వృక్షానికి చెందిన ఆకులు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఈ ఆకులను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. రోజూ ఉదయం పరగడుపునే 2 లేదా 3 ఆకులను నమిలి తినాలి. లేదా కషాయంలా తయారు చేసి తాగవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.