Annatto Seeds | నారింజ, ఎరుపు రంగులో మిక్స్ అయి ఉన్న ఈ విత్తనాలను మీరు ఎప్పుడైనా చూశారా..? వీటినే అన్నాట్టో సీడ్స్ అంటారు. ఈ విత్తనాలను సహజసిద్ధమైన ఫుడ్ కలరింగ్, ఫ్లేవరింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. అయితే ఈ విత్తనాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటి ద్వారా మనం పలు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అన్నాట్టో సీడ్స్‌లో అనేక రకాల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా బిక్సిన్, నోర్బిక్సిన్ వంటి కెరోటినాయిడ్స్ ఈ విత్తనాల్లో అధికంగా ఉంటాయి. అందుకనే ఈ విత్తనాలు ఆ రంగులో ఉంటాయి. అన్నాట్టో విత్తనాల్లో టోకోట్రైనాల్స్ ఉంటాయి. ఇది మన శరీరంలో విటమిన్ ఇగా మారుతుంది. టెర్పిన్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఈ విత్తనాల్లో అధికంగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది.
ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. వయస్సును వెనక్కి మళ్లించడంలోనూ ఈ విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అన్నాట్టో విత్తనాలలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ విత్తనాల్లో ఉండే టోకోట్రైనాల్స్ మన శరీరంలో విటమిన్ ఇ గా మారి రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
అన్నాట్టో విత్తనాల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు. ఈ విత్తనాల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి పలు రకాల బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు లేదా చర్మ సమస్యలు ఉన్నవారు ఈ విత్తనాలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. గాయాలు, పుండ్లు కూడా త్వరగా మానుతాయి. ఈ విత్తనాల్లో క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తుంది. కిడ్నీల ఆరోగ్యం కోసం కూడా ఈ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను కిడ్నీలు మరింత సమర్థవంతంగా బయటకు పంపేలా చేస్తాయి.
అన్నాట్టో విత్తనాల ద్వారా లాభాలు చాలానే ఉన్నాయి. అయితే మరి ఈ విత్తనాలను ఎలా తీసుకోవాలి..? అని చాలా మందికి సందేహం వస్తుంది. ఇక ఈ విత్తనాలను ఎలా తినాలంటే.. వీటిని నీటిలో మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా మెత్తని పొడిలా చేసి మీరు రోజూ చేసుకునే వంటలపై చల్లి తినవచ్చు. అన్నాట్టో సీడ్స్‌కు చెందిన ఆయిల్ కూడా లభిస్తుంది. దీన్ని కూడా ఉపయోగించవచ్చు. అన్నాట్టో విత్తనాలకు చెందిన ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నాట్టో సీడ్స్‌తో అనేక లాభాలను పొందవచ్చు.