మా బాబు వయసు ఆరేండ్లు. గత సంవత్సరం రెండుసార్లు గొంతు ఇన్ఫెక్షన్ అయింది. డాక్టర్ని సంప్రదిస్తే త్వరగానే కోలుకున్నాడు. అయితే, తెలిసినవాళ్లు ఇలా పిల్లాడు టాన్సిల్స్తో బాధపడుతుంటే.. ఆపరేషన్ చేయిస్తే మంచిది అంటున్నారు. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని చెబుతున్నారు! మా బిడ్డకు ఆపరేషన్ చేయించడం అవసరం ఉందంటారా?ప్రతి మనిషిలోనూ టాన్సిల్స్ ఉంటాయి. ఇవి గొంతు లోపలి భాగంలో ఇరువైపులా ఉంటాయి. టాన్సిల్స్ మన శరీరంలోకి వచ్చే సూక్ష్మక్రిములను నియంత్రించడానికి ఒక ఫిల్టర్లా పనిచేస్తుంటాయి. కానీ, కొన్నిసార్లు టాన్సిల్స్ ఇన్ఫెక్షన్కు గురవుతాయి. ఈ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతునొప్పి విపరీతంగా ఉంటుంది. జ్వరం తీవ్రంగా వస్తుంది. అంతమాత్రాన కంగారుపడాల్సిన అవసరం లేదు. మూడేండ్ల నుంచి ఎనిమిదేండ్ల పిల్లల్లో టాన్సిల్స్ పెద్దసైజులో ఉంటాయి. అలా ఉండటం సాధారణమే! అవి పెద్దగా ఉన్నంత మాత్రాన ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేదు. పదేపదే టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయి, తరచూ జ్వరానికి గురై ఇబ్బందిపడుతుంటే.. శస్త్రచికిత్స గురించి ఆలోచించాలి. మీ బాబు విషయంలో గతేడాది రెండుసార్లు ఇన్ఫెక్షన్కు గురయ్యాడని తెలిపారు. కోలుకున్నాడని కూడా పేర్కొన్నారు. కాబట్టి మీ బిడ్డ విషయంలో ఆపరేషన్ అవసరం లేదని నా అభిప్రాయం. మరోసారి పీడియాట్రీషియన్ను సంప్రదించండి. అవసరమైతే ఈఎన్టీ వైద్యుడి సలహా తీసుకోండి.
-డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్