న్యూఢిల్లీ : మనం తీసుకునే ఆహారం సాఫీగా జీర్ణమై మలినాలు విసర్జింపబడితేనే మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుంది. జీర్ణవ్యవస్ధ మెరుగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కొన్ని అనారోగ్యాలు, దురలవాట్లతో జీర్ణవ్యవస్ధ అస్తవ్యస్తమవుతుంది. ఇలాంటి పరిస్ధితి గ్యాస్, మలబద్ధకం, కడుపునొప్పి వంటి అనర్ధాలకు దారితీస్తుంది. జీర్ణవ్యవస్ధ సజావుగా, ఆరోగ్యంగా ఉండాలంటే మూడు అంశాల్లో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం జీర్ణమవడంలో ద్రవపదార్ధాలు కీలక పాత్ర పోషిస్తాయి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకుంటూ నిత్యం తగినంత నీరు తాగాలి. ద్రవపదార్ధాలు శరీరం పోషకాలను గ్రహించేలా చేయడంలో సహకరిస్తాయి. అదేసమయంలో అధిక మోతాదులో చక్కెర కలిసిన శీతల పానీయాలను తీసుకోవడం మానుకోవాలి. ఇక జీర్ణవ్యవస్ధ మెరుగ్గా పనిచేసేందుకు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. జీర్ణవ్యవస్ధ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
వాకింగ్, పైలేట్స్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు. ఇక జీర్ణ వ్యవస్ధ మెరుగ్గా పనిచేయడంలో ఆహారం పాత్ర ను విస్మరించలేం. ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తరచూ తీసుకోవాలి. ఇక తీపిపదార్ధాలు, ఉప్పు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను పరిమిత మోతాదులో తీసుకోవాలి.