‘మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది’ అని పెద్దల మాట. అలా మధ్యలో వచ్చేది దురలవాటైతే.. వీలైనంత త్వరగా పోవడం మంచిది. కానీ, ఈ తరం మగువలు మధ్యలో వచ్చిన కొన్ని అలవాట్లను అంత త్వరగా వదల్లేకపోతున్నారట. ముఖ్యంగా వ్యసనాల్లో పడితే.. పీకల్లోతుదాకా మునిగిపోతున్నారట. ఆ దురలవాట్ల బారినుంచి పురుషులు బయటపడినంత సులువుగా అతివలు తప్పించుకోలేక పోతున్నారని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది.
మోడ్రన్ కల్చర్‌లో పురుషులతో సమానంగా పొగ తాగుతున్న మహిళలు ధూమపానాన్ని మానేయడానికి డక్కామొక్కీలు పడుతున్నారని కెంటకీ యూనివర్సిటీ (యూఎస్) అధ్యయనంలో తేలింది. మగవాళ్లతో పొలిస్తే స్మోకింగ్ మానేయడం వాళ్లకు కష్టంగా ఉందని ఆ అధ్యయన సారాంశం.
నికోటిన్‌కు అడిక్ట్ కావడానికి మహిళల్లోని సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడైంది. ఏదైనా కావాలనుకునే ఆశను వ్యక్తీకరించే మెదడులోని ఒల్ఫాక్టోమెడిన్ ప్రొటీన్ కూడా ఈ వ్యసనానికి కారణమని అధ్యయనంలో తేలింది. కాబట్టి, ఆధునిక మగువలూ.. కొత్త పోకడలకు పోయే ముందు కీడెంచి మేలెంచడం మంచిది!!