హెపటో లేదా హెపాటిక్ అని వైద్య పరిభాషలో పిలిచే ఈ గ్రీకు పదానికి కాలేయం అని అర్థం. జీవ ప్రక్రియలలో కీలక పాత్ర పోషించే కాలేయం.. మానవ శరీరంలో పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం. ఇది దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. మన శరీరం లోపలి అవయవాలలో అతి పెద్దదైన కాలేయం.. అతి పెద్ద గ్రంథి కూడా. నాలుగు భాగాలుగా విభజితమై ఉండే కాలేయం 1.5 కేజీల బరువు ఉంటుంది.విషతుల్యమైన పదార్థాలు, కలుషితమైన ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వలన కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దానిని హెపటైటిస్ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్లు ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిలో బి, సి రకాలు ప్రమాదకరమైనవి. రక్త మార్పిడి వలన, అరక్షిత శృంగారం ద్వారా, తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్లు సోకే ప్రమాదం ఎక్కువ. హైపటైటిస్ బి వైరస్ సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ ఉంది. కానీ, హెపటైటిస్ ‘సి’కి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. అంతే కాకుండా హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ వ్యాక్సిన్ వేయించుకునే ముందు పరీక్ష చేయించుకొని, నెగెటివ్ ఉంటే ఏ వయస్సులోనైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం ఈ వ్యాక్సిన్‌ను వేయిస్తే చాలా మంచిది.
ఆకలి తగ్గడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు చెట్ల వైద్యం, నాటు వైద్యం లాంటివి చేసుకోకుండా, సరైన కారణం తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్ఫెక్షన్లు, ఫ్యాటీ లివర్ (FatyLever), లివర్ అబ్సెస్ (Liver Abcess), విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా, వీటిలో హెపటైటిస్ బి, సి వైరస్లు కలుగచేసే ఇన్ఫెక్షన్లు ప్రమాదకరమైనవి. ఇవి కొన్నేండ్ల తర్వాత కాలేయాన్ని గాయపరచడం, గట్టిగా మార్చడం (సిర్రోసిస్), తర్వాత క్యాన్సర్‌కు దారితీయడం.. ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అందుకే ఆసియా దేశాలలో హెపటైటిస్ – బి ఇన్ఫెక్షన్లు ఎక్కువ కాబట్టి, లివర్ క్యాన్సర్లూ ఎక్కువే. లివర్ క్యాన్సర్లలో హెపటుసెట్యూలార్ కార్సినోమా (కాలేయంలో మొదలైన క్యాన్సర్), మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ (ఇతర భాగాలలో వచ్చిన క్యాన్సర్ కాలేయానికి వ్యాప్తిచెందడం) అనే రెండు రకాలుంటాయి. జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు, బోన్ క్యాన్సర్లు.. ఇలా ఏ క్యాన్సర్ అయినా కాలేయానికి వ్యాప్తిచెందే ప్రమాదం ఎక్కువ. ఆలస్యంగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది.
కాలేయ క్యాన్సర్ తొలిదశలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించకపోవడం వలన ఇతర సమస్యలుగా పొరబడే అవకాశం ఎక్కువ. కడుపులో నొప్పి, బరువు తగ్గడం, కామెర్లు, పొట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు లివర్ క్యాన్సర్ ముదిరిన దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినా, హైపటైటిస్ బి, సి వైరస్ పాజిటివ్ ఉన్నా, మద్యం వంటి అలవాట్లు ఉన్నా, రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్యను, షుగర్, క్యాల్షియం లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను, ఆల్ఫాఫీటా ప్రొటీన్ (AFP)ను తెలిపే రక్త పరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్, డాక్టర్ సలహా మేరకు CT, MRI, PEP స్కాన్లు, లివర్ బయాప్సీ చేయిస్తే లివర్ క్యాన్సర్, స్టేజ్ వంటి వాటిని ముందుగానే తెలుసుకోవచ్చు.
ట్యూమర్ సైజు, కాలేయంలో వచ్చిన ప్రదేశాన్ని బట్టి చికిత్స, జీవితకాలం ఆధారపడి ఉంటాయి. ఈ క్యాన్సర్ పెరిగే గుణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే గడ్డ (కణితి) రెట్టింపు అయితే మరికొందరిలో ఏడాదిపైగా పట్టవచ్చు. కణితిని చిన్న సైజులోనే గుర్తించినా లివర్ సిర్రోసిస్‌కు గురికావడం వలన చాలా మందిలో సర్జరీ కుదరక పోవచ్చు. మందులతో కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టిరియల్ కీమో ఎంబో లైజేషన్, (TACE) రేడియో అబ్లేషన్, ఫొటాన్ బీమ్ థెరపీ, బయోథెరపీ, కీమో అబ్లేషన్, స్టీరియో టాక్టర్ రేడియో సర్జరీ వంటి అనేక పద్ధతులలో కణితిని తొలగించే లేదా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. గడ్డ చిన్నగా ఉండి మిగతా కాలేయం బాగానే ఉండి ఫెయిల్యూర్‌కు గురి కాకుండా ఉంటే, సర్జరీనే సరైన మార్గం. కణితి పరిమాణం పెద్దగా ఉన్నా, అనేక కణుతులు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్‌కు గురవుతూ ఉంటే.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వలన ఫలితాలు ఉంటాయి. ఈ క్యాన్సర్లకు ప్రధాన కారణం హెపటైటిస్ – బి వైరస్ కాబట్టి, పుట్టిన పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ వేయించడం ద్వారా చాలావరకు నివారించగలిగిన వారమవుతాం.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421