దీర్ఘకాలం తలనొప్పి బాధిస్తుంటే అది మెదడులో కణితికి సంకేతం. నిత్యం కడుపునొప్పి వెంటాడుతుంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్కు సూచన. రోజువారీ జీవితంలో ఎన్నో నొప్పులు మనల్ని పీడిస్తుంటాయి. ఒత్తిడి, ఉరుకులు పరుగుల జీవనశైలిని సాకుగా చూపినంత మాత్రాన సరిపోదు. ఆ నొప్పులను ప్రమాద సంకేతాలుగా పరిగణించాలి. వైద్యులను సంప్రదించాలి.
ఛాతీనొప్పి:
ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేం. నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో, సొంత వైద్యం అంతకంటే ఇబ్బందికరం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుండెపోటు, ఊపిరితిత్తులకు రక్తం అందకపోవడం (పల్మనరీ ఎంబాలిజం) తదితర లోపాలకు ఛాతీనొప్పి ఓ హెచ్చరిక.
కీళ్లనొప్పులు:
గాయాలు, వాపులు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల తలెత్తుతాయి. కీళ్లనొప్పులకు కారణాన్ని తెలుసుకుని, నాణ్యమైన చికిత్స చేయించుకోవాలి.
కండరాల నొప్పి:
విటమిన్-డి లోపం వల్ల, సూర్యకాంతి ఎక్కువగా సోకక పోవడం వల్ల వస్తుంది. డాక్టరును కలిసి సమస్యను పరిష్కరించుకోవాలి. అంతేకానీ, విటమిన్-డి సప్లిమెంట్లు సొంతంగా వాడకూడదు.
తలనొప్పి:
ఒత్తిడితో వచ్చేది, మైగ్రెయిన్.. ఇలా తలనొప్పి మూలాల్ని బట్టి వివిధ రకాలు ఉంటాయి. తలనొప్పులకు ఒత్తిడి, డీహైడ్రేషన్, కళ్లు స్ట్రెయిన్‌కు గురి కావడం మొదలైన సాధారణ కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు.. అధిక రక్తపోటు, బ్రెయిన్ ట్యూమర్ లాంటి తీవ్ర సమస్యలకు సంకేతం కూడా కావచ్చు.
పొట్టలో నొప్పి:
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ (జీర్ణాశయ సంబంధ) రుగ్మతలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, జననావ యవాల సమస్యలు కారణం కావచ్చు. అజీర్తి మొదలు అల్సర్స్ వరకు.. కడుపు నొప్పికి దారితీస్తాయి.
వెన్నునొప్పి: వెన్ను
సమస్యలు లేదా కిడ్నీ రుగ్మతలకు వెన్నునొప్పి హెచ్చరికగా నిలుస్తుంది. కండరాలు ఒత్తిడికి గురికావడం, గాయాలపాలు కావడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. క్యాన్సర్ లక్షణమైనా కావచ్చు.
చెవినొప్పి:
ఇన్ఫెక్షన్, గులిమి పేరుకుపోవడం, కర్ణభేరి ధ్వంసం కావడం వల్ల చెవినొప్పి తలెత్తుతుంది. వివిధ పరీక్షల ద్వారా అసలు కారణం తెలుసుకున్న తర్వాత, డాక్టర్లు చికిత్స చేస్తారు.
పాదాల నొప్పులు:
చాలా దూరం నడిస్తే పాదాలకు ఇబ్బంది కలుగుతుంది. దాంతో నొప్పిగా అనిపిస్తుంది. ఇలా కాకుండా తిమ్మిర్ల వల్ల పాదాలకు నొప్పి వస్తే మాత్రం.. శరీరంలో చక్కెర స్థాయులు పడిపోవడం ఓ కారణమై ఉండొచ్చు.
.. నొప్పులు కొన్నిసార్లు ఐరన్, విటమిన్-డి లోపానికి సూచనలు. ఇలాంటప్పుడు విటమిన్ ట్యాబ్లెట్లు, ఆహారంలో మార్పులు ఫలితాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు క్యాన్సర్, ఆటోఇమ్యూన్ రుగ్మతలకు సంకేతాలుగా నిలుస్తాయి. కాబట్టి నొప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.