Depression | ఒత్తిడికి గురవుతున్నారా? చికాకుగా అనిపిస్తున్నదా? అయితే ఒకటే పరిష్కారం. కొంతసేపు మీ సెల్‌ఫోన్ పక్కన పెట్టేయండి. అలా అని, ఇదేం ఉచిత సలహా కాదు. సాక్షాత్తు స్వాన్ సీ యూనివర్సిటీ (యూకే) నిపుణుల అధ్యయన సారాంశం. మీ సెల్‌ఫోన్ వాడకాన్ని రోజుకు ఓ పదిహేను నిమిషాలు తగ్గించుకున్నా చాలు.. రోగ నిరోధక వ్యవస్థలో ఎంతో కొంత మెరుగుదల కనిపిస్తుందని చెబుతున్నారు వారు. డిప్రెషన్, ఒంటరితనం తదితర మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని కూడా సలహా ఇస్తున్నారు.
స్వాన్సీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫిల్ రీడ్ తన అధ్యయన ఫలితాలను వివరిస్తూ.. ‘సెల్‌ఫోన్ వినియోగం తగ్గేకొద్దీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటం గమనించాం’ అని చెప్పారు. కొంతమందిని రెండు బృందాలుగా విడదీసి.. స్టాప్‌వాచ్ పెట్టి మరీ సెల్‌ఫోన్ వాడకాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడి అయ్యాయి.