Pneumonia In Kids | ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు న్యుమోనియా అనే ప్రాణాంతక ఇన్పెక్షన్ ను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఊపిరితిత్తుల ఇన్పెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. ఇది దాదాపు 30 మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేస్తుందని గణంకాలు చెబుతున్నాయి. ఈ ఇన్పెక్షన్ కూడా అధిక మరణాల రేటును కలిగి ఉంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో 14 శాతం మంది మరణాన్ని ఎదుర్కోవచ్చు. బ్యాక్టీరియా, వైరస్ లు ఈ న్యుమోనియాకు ప్రధాన కారణాలు. న్యుమోనియా కారణంగా ఊపిరితిత్తులు బలహీనపడడంతో పాటు మొత్తం రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. కనుక పిల్లలల్లో న్యుమోనియాను ముందుగానే గుర్తించడం అవసరం.
న్యుమోనియా లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స ఇవ్వడం వల్ల పిల్లలల్లో మరణాల రేటును కూడా తగ్గించవచ్చు. న్యుమోనియా బారిన పడినప్పుడు పిల్లలల్లో కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలా మంది గుర్తించరు. సాధారణ జలుబు, దగ్గుగా భావిస్తూ ఉంటారు. కనుక పిల్లల్లో న్యుమోనియా లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరంతరం పొడి దగ్గు రావడం లేదా కఫంతో కూడిన దగ్గు రావడం శరీరంలో న్యుమోనియా ఉందని చెప్పడానికి ఒక సంకేతం. ఈ దగ్గు ఊపిరితిత్తుల్లో వాపు , అవి శ్లేష్మం లేదా ద్రవంతో నిండడం వల్ల వస్తుంది. ఈ శ్లేష్మాన్ని లేదా ద్రవాన్ని బయటకు పంపడానికి పిల్లలకు దగ్గు వస్తుంది. సాధారణ దగ్గులా కాకుండా న్యుమోనియా వల్ల వచ్చే దగ్గు బొంగురుగా ఉంటుంది, తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. న్యుమోనియా ముఖ్య లక్షణాల్లో వేగంగా శ్వాస తీసుకోవడం కూడా ఒకటి.
ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లల ఛాతిని చూసి ఈ లక్షణాన్ని గమనించాలి. వైద్యులు కూడా ఎక్కువగా పిల్లల ఛాతిని గమనించి న్యుమోనియాను గుర్తిస్తారు. న్యుమోనియా ఉన్న పిల్లలల్లో ఛాతి నొప్పి లేదా ఛాతిలో అసౌకర్యం ఉంటుంది. ఊపిరితిత్తులు వాటి పనులను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఈ అసౌకర్యం తలెత్తుతుంది. శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ అసౌకర్యం లేదా నొప్పి మరింత తీవ్రతరం అవుతుంది. వైద్యులు ఛాతి ఎక్స్ రేను బట్టి కూడా న్యుమోనియాను నిర్దారిస్తారు. మనం ఏదైనా ఇన్పెక్షన్ కు గురి అయినప్పుడు సహజంగానే శరీరం జ్వరాన్ని అభివృద్ది చేస్తుంది. చలి, జ్వరం అనేది సాధారణ ఇన్పెక్షన్ కు గుర్తులు. పిల్లల శరీరం బ్యాక్టీరియా లేదా వైరస్ లను చంపడానికి శరీర ఉష్ణోగ్రతను పెంచడం వల్ల ఇది జరుగుతుంది. ఇన్పెక్షన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శరీరం అధిక ఉష్ణోగ్రతను చేరుకునే క్రమంలో చలి అభివృద్ధి అవుతుంది. చలితో అధిక జ్వరంతో బాధపడుతుంటే వారిలో తీవ్రమైన ఇన్పెక్షన్ ఉందని వారికి తక్షణ వైద్యం అవసరమని అర్థం.
ముఖ్యంగా ఐదు సంవత్పరాల లోపు పిల్లలు చలితో, జ్వరంతో బాధపడుతుంటే వారిలో బ్యాక్టీరియల్ న్యుమోనియా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే న్యుమోనియా ఉన్న పిల్లలల్లో అలసట, బలహీనత సర్వసాధారణం. ఇన్పెక్షన్ వల్ల పోరాడడం వల్ల శరీరం అలసిపోతుంది. వారి రోజువారీ కార్యకలాపాలు కూడా మందగిస్తాయి. చికిత్స అందిన తరువాతే వారిలో శక్తి సామర్థ్యాలు తిరిగి వస్తాయి. అదేవిధంగా న్యుమోనియా బారిన పడిన పిల్లల్లో ఆకలి తగ్గుతుంది. తినడానికి, తాగడానికి కూడా వారు నిరాకరిస్తారు. ఇన్పెక్షన్ వల్ల, శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల ఆకలి తగ్గుతుంది. న్యుమోనియాతో బాధపడే 60 శాతం మంది పిల్లల్లో ఆకలిలేదని ఒక అధ్యయనంలో తేలింది. ఇక శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల పెదవులు, గోర్లు నీలి రంగులోకి మారతాయి. న్యుమోనియాను తెలియజేసే తీవ్రమైన లక్షణాల్లో ఇది ఒకటి.
ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో పెదవులు, గోర్లు నీలంగా మారతాయి. పిల్లల్లో ఇటువంటి లక్షణాలను గమనించిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి తగిన చికిత్స అందించాలి. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదంగా మారుతాయి. కనుక న్యుమోనియాకు సంబంధించిన ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే పిల్లలకు చికిత్స అందించడం చాలా అవసరం.