శారీరక వ్యాయామం.. చిత్త వైకల్యానికి చెక్ పెడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేసేవారిలో అల్జీమర్స్ ప్రమాదం 45 శాతం తగ్గుతుందని అంటున్నారు. ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ విషయాలను బయటపెట్టారు. చిత్త వైకల్యం అనేది వృద్ధాప్య సంబంధిత పరిస్థితి. జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఆలోచనల్లో ఇబ్బందులు, ప్రవర్తనలో మార్పులు, భావోద్వేగ సమస్యలు, రోజువారీ కార్యకలాపాలకూ ఇబ్బంది పడటం.. దీని ముఖ్య లక్షణాలు. ఈ సమస్య మూలాలు తెలుసుకోవడానికి బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు.. గతంలోనే ఓ అధ్యయనం చేపట్టారు. ‘ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ’ పేరుతో ప్రారంభించిన ఈ సర్వే డేటాను తాజాగా పరిశీలించారు. ఈ అధ్యయనం కోసం మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఫ్రేమింగ్హామ్ పట్టణానికి చెందిన 4,300 మందిని ఎంపిక చేశారు. వీరిలో 1,502 మంది యువకులు, 1,943 మంది మధ్యవయస్కులు కాగా, 855 మంది వృద్ధులు ఉన్నారు. అధ్యయనంలో భాగంగా.. దాదాపు 37 సంవత్సరాలపాటు వీరి జీవన విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను కనుగొన్నారు.
తక్కువ స్థాయిలో శారీరక శ్రమ ఉన్న వారితో పోలిస్తే.. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారిలో డైమెన్షియా వచ్చే ప్రమాదం 45 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే మామూలు స్థాయిలో శారీరక శ్రమ చేసేవారిలో.. చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం 35-38 శాతం తక్కువగా ఉంటుందట. అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధి చెందడానికి ‘ఏపీఓఈ ఈ4’ జన్యు వైవిధ్యాన్ని ఒక బలమైన కారకంగా పరిశోధకులు పరిగణిస్తుంటారు. ఈ జన్యు వైవిధ్యం.. శారీరక శ్రమ-చిత్త వైకల్యం ప్రమాదం మధ్య సంబంధాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఈ అధ్యయనంలో గుర్తించారు. వ్యాయామం చిత్త వైకల్య ప్రమాదాన్ని తగ్గిస్తుందనీ, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనీ చెబుతున్నారు. ఇందుకుగల కారణాలనూ వెల్లడించారు. ‘వ్యాయామం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ స్థాయులు పెరుగుతాయి. దాంతో మెదడు సహా ఇతర శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. మెదడులో రక్త నాళాలూ చురుగ్గా పనిచేయడం వల్ల చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం తగ్గుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలా, వ్యాయామం అనేది చిత్తవైకల్యం నివారణ, చికిత్సలోనూ కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ చురుకైన జీవనశైలిని అనుసరించాలని సూచిస్తున్నారు.