Paya | చల్లని వాతావరణంలో వేడి వేడి పాయా తింటే వచ్చే మజానే వేరుగా ఉంటుంది కదా. పాయాను చాలా మంది రోటీలతో తింటారు. బ్రెడ్‌తో కూడా తినవచ్చు. కొందరు అన్నంతో తింటారు. ఎలా తిన్నా కూడా పాయా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పాయా సూప్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాయా సూప్‌ను తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో కొల్లాజెన్ ఉంటుంది. ఇది వండిన తరువాత గెలాటిన్లా మారుతుంది. ఈ క్రమంలో గెలాటిన్ మన శరీరానికి ఉపయోగపడే అనేక అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. అమైనో ఆమ్లాలు మనకు శక్తిని అందిస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. కనుక పాయాను తింటే శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు.
పాయాలో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫనస్, ఐరన్, జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఎ, కె, పలు రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ కూడా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పాయాను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. పాయాను తింటే ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటన్న వారు పాయాను తింటే మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. కీళ్లలో అరిగిన గుజ్జు తిరిగి ఉత్పత్తి అవుతుంది. దీంతో కీళ్లు మళ్లీ యథావిధిగా పనిచేస్తాయి. నొప్పులు తగ్గుతాయి.
పాయాను తరచూ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పాయా వల్ల మన శరీరంలోకి విడుదలయ్యే గెలాటిన్ జీర్ణ వ్యవస్థలో పలు అమైనో ఆమ్లాలను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. గ్లూటామైన్, గ్లైసీన్ అనే అమైనో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణాశయ గోడలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాయాను తరచూ తింటే అల్సర్, ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహాసం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. పాయాలో అనేక అమైనో ఆమ్లాలతోపాటు జింక్, ఐరన్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలను తగ్గిస్తుంది. వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.
పాయా ఉత్పత్తి చేసే కొల్లాజెన్, జెలాటిన్ వల్ల చర్మ ముడతలు పడకుండా దృఢంగా ఉంటుంది. అందువల్ల పాయాను తరచూ తింటుంటే చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. కండరాల నిర్మాణానికి కూడా పాయా ఎంతగానో దోహదం చేస్తుంది. పాయాను తింటుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. పాయా ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు దీన్ని తినకూడదు. కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గౌట్ సమస్యతో బాధపడుతున్నవారు, సోడియం స్థాయిలు అధికంగా ఉన్నవారు పాయాను తినకూడదు.