Health @ Body shapes | మనలో ఏ ఒక్కరం ఒకలా ఉండం. కొందరు సన్నగా ఉంటే.. ఇంకొందరు లావుగా ఉంటారు.. మరికొందరు శరీరానికి వ్యతిరేకమైన ఆకృతిలో ఉంటారు. మన శరీరాకృతులు మనల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి కూడా. అవే శరీరాకృతులు మన ఆరోగ్యాన్ని కూడా చెప్తాయి. నడుం, భుజాలు, తుంటి, బస్ట్ పరిమాణాలను విశ్లేషించడం ద్వారా మన ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చునంట. కొన్ని శరీరాకృతులు కొన్ని వ్యాధులను మోసుకొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. మన జీవనశైలి, ఆహారపుటలవాట్లు మన శరీర ఆకృతికి దోహదం చేస్తాయి. మన శరీర ఆకృతి సరైన రీతిలో లేనిపక్షంలో నిర్దిష్టమైన వ్యాధులకు కారణమవుతుంది.
శరీరాకృతులను పండ్లతో పోల్చుతుండటం సర్వసాధారణం. పియర్, యాపిల్, అవర్గ్లాస్ మొదలైన శరీర ఆకారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి వివిధ ప్రాంతాల్లో కొవ్వును నిల్వ చేస్తుంది. ఫలితంగా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జన్యుశాస్త్రం, ఎముకల నిర్మాణం, కండర ద్రవ్యరాశి, ఆడామగ బేధం, వయసు వంటివి మన శరీర ఆకృతిని నిర్ణయిస్తాయి.
యాపిల్ షేప్డ్ బాడీ..
వంకర నడుం ఉన్నవారిని ఆపిల్ ఆకారంతో పోల్చుతారు. దీనినే రౌండ్ లేదా సర్కిల్ బాడీ టైప్ అని కూడా అంటారు. యాపిల్ శరీర ఆకృతిని శాస్త్రీయ సమాజంలో ఆండ్రాయిడ్ అని పిలుస్తారు. అంటే కొవ్వు ఎక్కువ భాగం మధ్య భాగంలో నిల్వ చేయబడుతుంది. పిరుదులు, తొడల భాగంలో తక్కువగా కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వులు జీవనశైలి అసమతుల్యతకు కారణమవుతాయి. ఈ బాడీ షేప్ ఉన్నవారికి పొట్టలో నిల్వ ఉండే కొవ్వుల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ. ఆపిల్-ఆకారపు ఫిగర్ మరీ ముఖ్యంగా మగవారు అధిక ఆల్కహాల్ వినియోగం తీసుకునే వారుగా ఉంటారని కూడా చెప్తుంటారు.
పియర్ షేప్డ్ బాడీ..
ఆపిల్‌కు విరుద్ధంగా పియర్ షేప్డ్ బాడీ ఉంటుంది. ఈ శరీరాకృతిని శాస్త్రీయ సమాజంలో గైనాయిడ్ అని పిలుస్తారు. మధ్య భాగంలో కంటే పిరుదులు, తొడల్లో ఎక్కువగా కొవ్వు నిల్వ చేయబడుతుంది. గైనాయిడ్ శరీర ఆకృతి ఉన్నవారు తరచుగా చిన్న నడుం కలిగి ఉంటారు. తుంటి భాగం నడుం కంటే వెడల్పుగా ఉంటుంది. వీరిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. అయితే, కాళ్ళపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది, మోకాలు, కాళ్ళ కీళ్ల సమస్యలను కలిగి ఉంటారు.
అవర్గ్లాస్ షేప్డ్ బాడీ..
ఈ రకమైన శరీరాకృతి ఉన్నవారిలో నడుంతో పాటు భుజాలు సమతులంగా ఉంటాయి. ఈ శరీర రకంలో కొవ్వు నిల్వ శరీరంలోని ఒక ప్రాంతంలో ఉండదు. కాబట్టి బరువు పెరగడం చాలా స్పష్టంగా కనిపించదు. అయితే, వీరిలో అధిక బరువు ఉంటే మాత్రం గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నడుము చుట్టూ విసెరల్ కొవ్వు అభివృద్ధి అయిన వారిలో శరీర అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బాడీ..
విలోమ త్రిభుజం శరీర రకం అనేది తుంటి కంటే భుజాలు వెడల్పుగా ఉంటాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. అయితే, పెద్ద బస్ట్, బ్రెస్ట్ డెన్సిటీ కారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ శరీర ఆకృతి ఉన్నవారు మంచి జీవక్రియను కలిగి ఉంటారు. త్వరగా బరువు పెరగరు. అయితే, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నట్లయితే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
రెక్టాంగులర్ షేప్డ్ బాడీ..
ఈ శరీర ఆకృతి కలిగే ఉండే వ్యక్తులు బరువును దామాషా ప్రకారం పొందుతుంటారు. కాలక్రమేణా ఎముకల సాంద్రతను కోల్పోతారు. బోలు ఎముకల వ్యాధిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
చివరగా..
మన శరీరాకృతి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ ఖచ్చితంగా అంచనా వేయదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి వాటి వల్ల కొవ్వులను తగ్గించుకోవచ్చు. తద్వారా హానికరమైన గుండె జబ్బుల నుంచి బయటపడొచ్చు.