Mental Health | శరీరం కంటే మనసు సున్నితమైంది. దానికి వచ్చే సమస్యలూ సంక్లిష్టమైనవే. కానీ లేనిపోని అపోహలతో చాలామంది మానసిక చికిత్సల కోసం నిపుణుల దగ్గరికి వెళ్లరు. ఈమధ్య అవగాహన పెరుగుతున్నా, అందుబాటులో నిపుణులు లేకపోవడం అన్నది మరో అడ్డంకిగా మారింది. వీటికి తోడు.. మానసిక సమస్యలకు ప్రత్యక్ష కౌన్సెలింగ్ చాలా ముఖ్యమనీ, ఆన్లైన్ చికిత్సలు పెద్దగా ప్రభావం చూపవనే అభిప్రాయం ఉంది. ఇందులో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇందుకోసం పి.టి.ఎస్.డి, బైపోలార్ డిజార్డర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నవారిని రెండు భాగాలుగా విభజించారు. కొందరికి ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా, మరికొందరికి నేరుగా సైకియాట్రిస్ట్ ద్వారా చికిత్స ఇప్పించారు. ఆశ్చర్యంగా, ఈ రెండిటి ఫలితాలూ ఒకేలా కనిపించాయి. గ్రామీణ ప్రాంతాలు, పేద దేశాల ప్రజలు సరైన మానసిక నిపుణులు అందుబాటులో లేక సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ పరిశోధన ఓ మంచి సంకేతమే. గ్రామీణ ప్రాంతాలకు కూడా మానసిక వైద్యాన్ని తీసుకెళ్లొచ్చు.