చలికాలంలో చాలామంది వేడినీళ్ల స్నానమే చేస్తుంటారు. అయితే, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరానికి హాయిగా ఉన్నా.. లేనిపోని సమస్యలూ ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని కాలాల్లో చన్నీళ్ల స్నానం చేయొచ్చా? చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిదేనా? అన్నదానిపై ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసర్చ్ అండ్ ఇంజినీరింగ్ డెవలప్మెంట్ ప్రచురించిన పరిశోధనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. వేడి నీళ్లతో స్నానం చేస్తే శరీరంలో ఉండే కెరెటిన్ కణాలు దెబ్బతింటాయి. తామర వంటి చర్మ సమస్యలు తీవ్రతరం అవుతాయని అందులో స్పష్టం చేశారు. చాలామంది తరుచుగా వేడి నీళ్లతో స్నానం చేసేందుకే మొగ్గు చూపిస్తారు. కానీ, ఇలా చేయడం అంత మంచింది కాదని డెర్మటాలజిస్టులు కూడా చెబుతున్నారు.
స్నానం చేసేటప్పుడు నీళ్లు వేడిగా ఉండటం ముఖ్యమే. అయితే, చలి అనిపించకుండా ఉండేంత వేడి మాత్రమే ఉండాలి. మన చర్మ బాహ్య పొరలో సీబమ్, లిపిడ్స్కు చెందిన పలుచని జిడ్డు పొర ఉంటుంది. అది దుమ్ము, ధూళి, బాహ్య ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. చర్మం పొడిబారకుండా.. తేమగా, మృదువుగా ఉంచడంలోనూ ఈ పొర కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంపై వేడినీళ్లు పోసుకున్నప్పుడు, మన చర్మంపై ఉండే ముఖ్యమైన ఆయిల్స్ అన్నీ పోతాయి. కాబట్టి, పొగలు కక్కే నీళ్లకు బదులు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల చలినుంచి ఉపశమనం లభించడంతోపాటు శరీరారోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లం అవువుతామని చెబుతున్నారు.