నా వయసు ముప్పై ఒకటి. ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. బరువు 57 కిలోలు. చూడ్డానికి సన్నగా ఉంటాను. కానీ ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సూచించే ఎల్డీఎల్, ట్రై గ్లిసరైడ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎందుకు జరిగింది? చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
మన ఆహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్‌లో తేడాలు ఉంటాయి. కాగబెట్టిన నూనెలు అధికంగా వాడటం, తరచూ వేపుళ్లు తినడం, మటన్లాంటివి అతిగా తీసుకోవడం, ఒకే రకమైన నూనెలు ఎక్కువకాలం వాడటం.. లాంటివి దీనికి కారణం కావచ్చు. చైనీస్ వంటకాల్ని కొందరు ఇష్టంగా తింటారు. అవన్నీ పూర్తిగా మైదాతోనే చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను వదిలించు కోవాలంటే మైదా, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను దూరం పెట్టాలి.
డీప్ ఫ్రైలు, మాంసాహారం తగ్గించుకోవాలి. పొగ, ఆల్కహాల్‌లాంటి అలవాట్లు మానేయాలి. రోజుకు నాలుగైదుసార్లు పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. దీనివల్ల పొట్ట నిండిన అనుభూతి కలిగి.. అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోం. అలాగే రోజుకు ఒక కప్పు ఓట్స్, బ్రౌన్రైస్లాంటి ధాన్యాలు తీసుకోవాలి. అదనంగా ఓ కప్పు పప్పు దినుసులు కూడా జోడించాలి.
ఆరోగ్యకర కొవ్వుల్ని అందించే బాదం, వాల్నట్స్తోపాటు.. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కోసం అవిసె, గుమ్మడి గింజల్లాంటివీ తినాలి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్లు కూడా దొరుకుతాయి. చెడు కొవ్వుల్ని దూరం చేయడంలో అల్లం వెల్లుల్లి సైతం సాయపడతాయి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజూ ఓ గంట వ్యాయామం చేయాలి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@ gmail.com