ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Sep 14, 2020 , 20:09:33

బొప్పాయితో బోలెడు లాభాలు..!

బొప్పాయితో బోలెడు లాభాలు..!

హైదరాబాద్‌: బొప్పాయి.. తెలంగాణలో పొప్పెడి పండు అని పిలుస్తాం. మన దగ్గర విరివిగా లభించే పండ్లలో ఇది ఒకటి. మార్కెట్‌లో అన్ని సీజన్లలో దొరుకుతుంది. అలాగే, పల్లెటూర్లలో దాదాపు ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. నగరాల్లోనూ తక్కువ ధరలో లభిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సీ విటమిన్ కే అధిక మోతాదులో ఉంటాయి. ఫైబర్‌, మెగ్నీషియం కూడా ఎక్కువగానే ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

కొవిడ్‌ నేపథ్యంలో ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకోవాలని చూస్తున్నారు. కనుక ఈ సమయంలో బొప్పాయిని ప్రతిరోజూ తీసుకోవడం శ్రేయస్కరం. ఇందులో విటమిన్‌ ఏ, సీ ఉంటాయి. ఈ విటమిన్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. జలుబు, ఫ్లూ రాకుండా బొప్పాయి అడ్డుకుంటుంది.  

బరువు తగ్గొచ్చు..

బరువు తగ్గాలని డైట్‌ పాటిస్తున్నవారికి ఇది చాలా మంచి ఆహారం. ఇందులో ఫైబర్‌ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ సేపు కడుపునిండిన భావన కలిగిస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. 

జీర్ణక్రియ మెరుగవుతుంది..

జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి తినడం ప్రయోజనకరం. వీటిలో అల్సర్లను తగ్గించే గుణాలుంటాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్దకాన్ని బొప్పాయి నివారిస్తుంది.

కడుపులో మంట తగ్గుతుంది..

ఇందులో పపైన్‌, కిమోపపైన్‌ అనే ఎంజైమ్స్‌ ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయి. గాయాలను కూడా త్వరగా మానేలా చేస్తాయి.  

కంటి చూపుకు దివ్యౌషధం..

బొప్పాయి తినడం వల్ల కంటిచూపు తగ్గకుండా ఉంటుంది. ఇందులో ల్యూటిన్, జియాక్సాన్‌థిన్, క్రిప్టాక్సాన్‌థిన్ అనే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షిస్తాయి.  

కేన్సర్‌తో పోరాడుతుంది..

పెద్ద పేగు, ప్రొస్టేట్ కేన్సర్లను తగ్గించే గుణం బొప్పాయికి ఉంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్స్ ఉండటమే దీనికి కారణం.

చర్మ సంరక్షణకు..

చర్మ సంరక్షణకు బొప్పాయి ఎంతో ఉత్తమం. దీన్ని చర్మానికి రాసుకుంటే.. పపైన్ అనే ఎంజైమ్ వల్ల శరీరం కాంతివంతం అవుతుంది. మొటిమలు తగ్గుముఖం పడతాయి. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo