బోర్ కొట్టినా.. పని ఎక్కువగా ఉన్నా స్క్రీన్‌కే అతుక్కునే రోజులివి. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ గంటలతరబడి కూర్చోవడం.. స్కూల్‌బస్‌లో.. ప్రయాణంలో.. ఆఫీసులో, టీవీ ముందు, థియేటర్లో, వాహనంపై ఇలా స్థలం మారినా కూర్చోవడం మారటం లేదు. ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యల్లో గుండె సంబంధిత ఇబ్బందులు ముందువరుసలో ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు.
రోజంతా గంటల తరబడి కూర్చోవడం వల్ల గుండె పనితీరు మందగించి గుండె సంబంధిత రోగాలు వస్తున్నాయి అంటున్నారు వైద్యనిపుణులు. ఉదయం లేచింది మొదలు, నిద్రించే వరకు ఆఫీసుకు వెళ్లే ప్రయాణంలో, ఆఫీసులో ఎనిమిది గంటలు కూర్చోవడం, వర్క్ ఫ్రం హోమ్, ఇంటికి వచ్చాక టీవీ చూడటం, మొబైల్ వాడటం ఇలా కారణం ఏదైనా కావచ్చు.. నిరంతరంగా కదలికలు లేకుండా.. ఎక్కువ సేపు కూర్చుంటూ గుండెకు ముప్పు తెస్తున్నాం.
చాలామంది ఉదయం చేసే వాకింగ్, స్ట్రెచింగ్, వ్యాయామాలు, ఆసనాలు, జిమ్ వంటివి చేసి రోజంతా కూర్చున్నా ఫర్వాలేదు అనుకుంటారు. కానీ, వ్యాయామం చేసినంత మాత్రాన కదలిక లేకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య పరిశోధకులు. గంటల తరబడి కూర్చోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు వెంటనే కనబడకపోవడం వల్ల ఏం జరుగుతుందిలే అనుకుంటారు. కానీ, ఈ బైఠాయింపు శరీరంలో అనేక మార్పులకు కారణం అవుతుందట. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెటబాలిజం మందగించి, శరీరంలో క్యాలరీల ఖర్చు తగ్గిపోతుంది. చెక్కర స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని గుండెకు ముప్పు వాటిల్లుతుందని నిపుణుల మాట.
జన్యుపరమైన ఇబ్బందులు, జీవనశైలిలో మార్పు కారణాలు ఏవైతేనేం.. యుక్తవయసులోనే గుండె జబ్బుల బారినపడుతున్న వారిలో భారతీయులు ముందున్నారు. ఎవరైతే తక్కువ కదలికలతో రోజులు వెళ్లదీస్తున్నారో వారిలో కార్డియో సమస్యలు ఎక్కువ వచ్చినట్లు వర్క్ ఫ్రం హోం ఉద్యోగులపై చేసిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఒకప్పుడు కొలీగ్‌తో మాట్లాడటానికి నడిచి వెళ్లేవారు. పని ప్రదేశాల్లో మెట్లు ఎక్కేవారు, అవసరమైతే పరుగులు తీసేవారు. వారందరినీ నేడు టెక్నాలజీ స్థిరంగా కూర్చోబెట్టి మొత్తం పనిని మెసేజ్, వీడియోకాల్స్, ఫోన్‌కాల్స్ అంటూ ఒక క్లిక్కి మాత్రమే పరిమితం చేసింది. తమాషా ఏంటంటే టెక్నాలజీ మన పనిని సులభం చేసి.. మన దినచర్యలో కదలికలను గుప్పెట్లో పెట్టుకొని ఆయుర్దాయాన్ని తగ్గిస్తున్నది.
శరీర నిశ్చలస్థితి వల్ల మెటబాలిజంలో, గుండె కండరాల్లో, రక్తనాళాల్లో జరిగే మార్పులు పెనుముప్పునకు దారితీయవచ్చు. మరి ఈ ముప్పునుంచి బయటపడే మార్గమే లేదా? ఉంది అంటున్నారు ఆరోగ్య పరిశోధకులు. రోజులో తక్కువ కదలికలు ఉండే వారు సాధారణంగా ఫిట్నెస్ ట్రైనర్స్ సూచించే వ్యాయామాలను రెట్టింపు చేస్తేనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని సలహా ఇస్తున్నారు.
డెడికేటెడ్ వర్కవుట్ సెషన్స్‌పై ఆధారపడే కంటే పని వేళల్లో ప్రతి గంటకు 5 నిమిషాలు నడవడం అలవాటుగా చేసుకోవాలి.
ఫోన్ మాట్లాడేటప్పుడు, సహోద్యోగులతో ఆలోచనలను పంచుకొనేటప్పుడు నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు కూర్చొనే డెస్క్‌కు కొద్ది దూరంలో వాటర్ బాటిల్ ఉంచడం. బాటిల్ అవగానే రీఫిల్ చేయడం లాంటివి నాలుగు అడుగులు వేసేందుకు దోహదం చేస్తాయి. ఈ చిన్న మార్పులేం రక్షిస్తాయి అనుకోకండి. సంస్థలో మన పనిని మెచ్చి అభినందిస్తే సంతోషంతో మరింత ఎక్కువ పని చేయడానికి ఆసక్తి చూపుతాం. మన కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న గుండె కోసం ఈ మాత్రం కదల్లేమా! కదలండి.. గుండెకు భద్రత కలిగించండి!!