పిల్లలకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఎలాంటి ఆహారం పెట్టాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పండి.
– ఓ పాఠకురాలు
బిడ్డ జబ్బు పడినప్పుడు.. తన
పెరుగుదలలో ఎలాంటి లోపం రాకుండా జాగ్రత్తపడటం కన్నవారి బాధ్యత. అంటువ్యాధులకు ఆహార లోపాలు తోడైతే పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రత్యేకించి, అనారోగ్య
సమయంలో ఆకలి బాగా తగ్గి పోతుంది. వాంతులు అవుతాయి. దీనివల్ల పిల్లలు తీసుకునే ఆహార పరిమాణం తగ్గిపోతుంది. అతిసార, మీజిల్స్ వచ్చినప్పుడైతే.. తీసుకున్న ఆహారంలో కొంత మాత్రమే ఒంటికి పడుతుంది. ఇప్పటికీ కొందరు తల్లిదండ్రులు ‘లంఖణం పరమౌషధం’ అనే దురభిప్రాయంతో పిల్లల కడుపు మాడ్చు తుంటారు.
నిజానికి, పరిపూర్ణ ఆరోగ్యవంతులతో పోలిస్తే, అనారోగ్య పీడితులకే ఆహార అవసరాలు ఎక్కువ. రుగ్మతను ఎదుర్కోడానికి మందులతోపాటు బలవర్ధక ఆహారమూ అవసరం. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న దశలో బాగా ఆకలేస్తుంది కూడా. ఈ సమయంలో గతంతో పోలిస్తే.. మరింత ఎక్కువ పరిమాణంలో, మరిన్ని పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. ఇష్టమైన రుచులనే.. మెత్తగా చేసి కొద్దికొద్దిగా ఎక్కువసార్లు పెట్టాలి. పిల్లలు ద్రవ పదార్థాలపై ఆసక్తి చూపుతారు. అంతేకాదు, రోగ నిరోధక శక్తికి తల్లిపాలూ చాలా ముఖ్యం. పూర్వం ఉన్న బరువుకు తిరిగి చేరుకొనేంత వరకూ పిల్లలు పూర్తిగా కోలుకోనట్టే.