Overactive Bladder | తరచుగా మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ సమస్య. కానీ, కొందరు మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన కొద్దిసేపటికే మళ్లీ వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కానీ, ఇది సాధారణమైన విషయం మాత్రం కాదు. ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ (Overactive Bladder – OAB) అనే ఆరోగ్య సమస్య కావొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మూత్రాశయంలో చాలా తక్కువ మూత్రం స్టోర్ అయినా.. మళ్లీ మళ్లీ మూత్రం విసర్జనకు వెళ్లాలనిపిస్తుంది. ఈ సమస్యతో పగలు, రాత్రి మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దాంతో రాత్రిళ్లు నిద్రాభంగం కలుకడంతో పాటు సామాజిక జీవితానికి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
రోజుకు ఎనిమిది సార్లు కంటే ఎక్కువ.. రాత్రి రెండుసార్లు కన్నా ఎక్కువ బాత్రూంకి వెళ్లడం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లక్షణాలని వైద్యులు పేర్కొంటున్నారు. అకస్మాత్తుగా మూత్ర విసర్జన కోరికలు కలుగడం.. మూత్రాన్ని నియంత్రించలేకపోవడం, మలమూత్ర నియంత్రణ లోపం (urge incontinence) కూడా దాని లక్షణాలేనని పేర్కొంటున్నారు. ఈ సమస్య మూత్రాశయ కండరాల్లో అసాధారణ సంకోచం, వయస్సు పెరిగే కొద్దీ సమస్య పెరగడం, నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు (స్ట్రోక్, మల్టిపుల్ స్క్లెరోసిస్/స్పైనల్ కార్డ్ గాయం) కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహం, మలమూత్ర మార్గ సంబంధిత ఇన్ఫెక్షన్లు (UTI), కాఫీ.. ఆల్కహాల్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, అధికంగా నీరు లేదంటే ఇతర ద్రవాలు తీసుకోవడం కారణాలుగా చెబుతున్నారు.
ఈ సమస్య బారి నుంచి బయటపడేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ, ఆల్కహాల్ మోతాదును తగ్గించాలి. రోజంతా నీరు పరిమితంగా తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. నిద్రపోయే రెండుగంటల ముందు ద్రవ పదార్థాలు తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు. మూత్ర విసర్జన అలవాటును సమయ పరిమితిలో ఉంచడం.. మూత్ర విసర్జన వ్యవధిని క్రమంగా పెంచుతూ రావాలని సూచిస్తున్నారు. పలు వ్యాయమాలు, ఫిజియోథెరపితో సమస్య నుంచి గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు. కెగెల్ వ్యాయామాలు మలమూత్ర నియంత్రణకు ఉపయోగపడతాయి. ఇవి పెల్విక్ కండరాలను బలంగా ఉంచుతాయని చెబుతున్నారు.
సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంద్రించి మందులు వాడడం వల్ల సమస్య తగ్గుతుంది. ప్రత్యేక సందర్భాల్లో శస్త్రచికిత్స, న్యూరోస్టిమ్యులేషన్, ఇతర చర్యలు పని చేయని సమయంలో.. న్యూరోమోడ్యులేషన్ పద్ధతులను అవలంభించవచ్చన్నారు. ఈ సమస్య నిద్ర, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే.. మూత్ర విసర్జన సమయంలో మంట, రక్తం రావడం, తీవ్రమైన నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఓవర్యాక్టివ్ బ్లాడర్ సాధారణ ఆరోగ్య సమస్య లాంటిదే అయినా, దీన్ని నిర్లక్ష్యం చేస్తే రోజువారీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య నిపుణులను సంప్రదించి సలహాలు సూచనలు పాటిస్తే సమర్థవంతంగా సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది.