Heart attack risks factors | ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్నది. చిన్నవయసు వారిలోనూ గుండెపోటు రావడం కలవరానికి గురిచేస్తున్నది. మన జీవనశైలి, మన ఆహారం అలవాట్లే గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని తెలిసినా మనం వాటిని వదిలించుకోవడం లేదు. సరికదా ప్రమాదకరంగా మారగానే అప్పుడే అలవాట్లు మార్చుకుని ఉంటే బాగుండేది అంటూ సలహాలు ఇస్తుంటాం. ఇది సర్వసాధారణంగా తయారైంది. అలాకాకుండా గుండెపోటు ఎందుకు వస్తుంది..? రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..? కారకాలను ఏవిధంగా దూరం చేయాలి..? అనే విషయాలపై ప్రతీ ఒక్కరు దృష్టిసారించాలి.
గుండె పోటు వచ్చేటప్పుడు సంకేతాలుగా తొలుత అరగంట లేదా అంతకంటే ముందు ఛాతీలో నొప్పి ప్రారంభమవుతుంది. ఎడమ చేతిలోనూ నొప్పి వస్తుంది. ఆ వెంటనే విపరీతంగా చెమటలు కనపిస్తాయి. వీటిని మనం వెంటనే గుర్తించకపోతే అది మనల్ని ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంటుంది. మహిళల్లో కంటే పురషుల్లోనే గుండెపోటు ఎక్కువగా సంభవిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా మగవారిలో ఉండే అలవాట్లు, జీవనశైలి. వీటిపై దృష్టి పెట్టి ఆహార విహారాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని నివారించుకోవచ్చు అని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు.
సిగరెట్ స్మోకింగ్..
సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఇటీవల ఎక్కువైంది. ఫ్యాషన్‌గా యువకులు సిగరెట్ స్మోకింగ్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. సిగరెట్లో ఉండే రసాయనాలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. అలా చిక్కగా మారడం వలన సిరలు, ధమనుల లోపలి గోడల్లో గడ్డలను ఏర్పడుతాయి. ఇలా గడ్డలు సిరలు, ధమనుల్లో గడ్డ కట్టి రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వలన గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆకస్మిక మరణానికి కూడా దారి తీస్తుందని గుర్తించాలి. సిగరెట్ స్మోకింగ్ అలవాటును మానుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
అధిక రక్తపోటు..
అధిక రక్తపోటు స్థాయిలను అదుపులో పెట్టుకోవడంపై ప్రతీ ఒక్కరూ దృష్టిపెట్టాలి. ఇది గుండెకు ఎంతో ప్రయోజనకారి అని గుర్తించాలి. అధిక రక్తపోటు వచ్చినప్పుడు ధమనులు సాగేలా అవుతాయి. ఇలా ధమనులు సాగడం వల్ల గుండెకు ఆక్సిజన్, రక్తం ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటుకు దారితీస్తుంది. అందుకని అధిక రక్తపోటు లేకుండా జాగ్రత్తపడాలి. రక్తపోటును తగ్గేందుకు సాయపడే ఆహారాలను నిత్యం తింటూ ఉండాలి.
అధిక కొలెస్ట్రాల్..
శరీరంలో కొలెస్ట్రాల్ ఉండాలి. కానీ చెడు కొలెస్ట్రాల్ ఉండటం వలన గుండె ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒక వ్యక్తి శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ఆ వ్యక్తిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ధమనలు గోడల్లో పేరుకుపోయి రక్త ప్రవాహం సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా గుండెకు రక్తం సరఫరా తగ్గిపోయి ఆక్సిజన్ సరిగా అందక గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. అందుకని మనం నిత్యం తీసుకునే ఆహారాల ద్వారా మంచి కొలెస్ట్రాల్ మాత్రమే శరీరానికి అందేలా చూసుకోవాలి.
డయాబెటిస్..
శరీరంలో అధిక చక్కెరల మోతాదులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలోకి అధిక మొత్తంలో చక్కెరలు రక్తనాళాలు, నరాలను దెబ్బతీస్తాయి. గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకోవడమే కాకుండా ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేయకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా గుండె పనితీరుపై ప్రభావం చూపి మందగించి గుండెపోటుకు గురవుతుంది.
ఊబకాయం లేదా అధిక బరువు..
శరీరం అధిక బరువు కారణంగా ధమనుల్లో కొవ్వు ప్రదార్థాలు పేరుకుపోయేందుకు దారితీస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దెబ్బతిన్నట్లయితే అది గుండెపోటుకు దారితీయవచ్చు. అందుకని శరీరం అధిక బరువును లేదా ఊబకాయాన్ని నివారించుకునేలా చూసుకోవాలి. అధిక బరువును అధిగమించే ఆహారాలను తీసుకుంటూ ఊబకాయాన్ని నివారించుకుంటూ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
శారీరక శ్రమ..
బిజీ బిజీ జీవితాల కారణంగా శారీరక శ్రమ కరవైపోతున్నది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ ఉండాలన్నది గ్రహించాలి. నిత్యం కనీసం అర్ధ గంట సైపైనా వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోగానీ, తోటపని గానీ చేస్తూ గడపాలి. కరోనరీ హార్ట్ సంబంధ మరణాల్లో దాదాపు 35 శాతం శారీరక శ్రమ లేకపోవడం వల్లనే అని అంచనా వేస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ఒక్కటే సరిపోదు. దానితోపాటు శరీరానికి తగిన శ్రమను కూడా అందించడము కూడా ముఖ్యమే అని మర్చిపోవద్దు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.